పిలిచి… పిలిచి తల్లి మృతదేహం పక్కనే నిద్రపోయిన బాలుడు

అమ్మా అమ్మా నే పసివాణ్ణమ్మా… నువ్వే లేక వసివాడానమ్మా…
మాటే లేకుండా నువ్వే మాయం… కన్నిరవుతోంది యదలో గాయం…
అయ్యో వెళిపోయావే… నన్నొదిలేసి ఎటు పోయావే…
అమ్మా ఇకపై నే వినగాలనా నీ లాలిపాట… నే పాడే జోలకు నువు కన్నెత్తి చూసావో అంతే చాలంట…. ఈ పాట వింటేనే హృదయం కదిలిపోతుంది. ఓ సినిమాలో తన కన్నతల్లి కన్నుమూసిన తర్వాత తల్లి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ… ఈ పాట పాడతాడు… కానీ, నిజజీవితంలో ఓ బాలుడికి ఇలాంటి పరిస్థితే వచ్చింది. కాకపోతే తల్లి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిందని ఆ బాలుడికి తెలియదు. ఆస్పత్రిలో కన్నుమూసిన తన కన్నతల్లిని… అమ్మా… అమ్మా… అంటూ పిలిచి… పిలిచి… చివరకు అసలి… ఆ పసివాడు అమ్మ మృతదేహం పక్కనే పడుకున్న ఘటన చూసిన అందరి హృదయాలు బరువెక్కాయి… వారికి తెలియకుండానే కళ్లవెంట నీరు కారిపోయింది.

వివరాల్లోకి వెళ్తే… హైదరాబాద్‌ అత్తాపూర్‌కు చెందిన సుమీనా సుల్తానా అనే మహిళను ఐదేళ్ల కుమారుడున్నాడు. మూడేళ్ల క్రితమే భర్త… సుల్తానాను వదిలి ఎక్కడికో వెళ్లిపోయాడు… కూలీనాలీ చేస్తూ కుమారుడిని పోషించుకుంటున్న ఆమె ఎప్పటి నుంచో గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. మొన్న రాత్రి తీవ్ర అస్వస్థతకు గురైన సుల్తానాను ఎవరో ఉస్మానియా ఆస్పత్రిలో చేర్పించారు. ఆమెతోపాటు ఐదేళ్ల కుమారుడిని కూడా అక్కడే విడిచిపెట్టి వెళ్లిపోయారు. అప్పటికే కొంత ఆలస్యం జరగడంతో… రక్తపోటు, పల్స్‌ పడిపోయి కాసేపటికే సుల్తానా మృతిచెందింది. ఇక త్లి మృతిచెందిన సంగతి తెలియని ఆ బాలుడు… మృతదేహం పక్కనే కూర్చొని… అమ్మా… అమ్మా… అని పిలిచి అలసిపోయి తన తల్లి మృతదేహం పక్కనే పడుకున్నాడు. ఈ ఘటన అక్కడున్నవారినంత కన్నీరుపెట్టించింది. ఇక మృతురాలికి సంబంధిచిన ఎలాంటి సమాచారం లేకపోవడంతో వైద్యులు పోలీసులకు సమాచారం ఇవ్వడం… పోలీసులు ఆరా తీసి… జహీరాబాద్‌లోని ఆమె బంధువులకు సమాచారం ఇవ్వడం… అనంతరం పోస్టుమార్టం నిర్వహించిన మృతదేహాన్ని బంధువులకు అప్పగించడం అన్నీ జరిగిపోయాయి… ఈ పరిణామాలన్నీ చూసిన ఆ పసివాడికి అమ్మ లేదని విషయం తెలిసి… కన్నీరుమున్నీరవుతూ పడుతున్న వేదన అందరినీ కదిలించింది.