ఆధార్ లింకింగ్ గడువు పొడిగింపు..!

ప్రత్యేక గుర్తింపు సంఖ్య అయిన ఆధార్‌ అనుసంధానంపై సామాన్యులకు భారీ ఊరట లభించింది. ఈ మార్చి 31తో ముగియనున్న వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, బ్యాంకు ఖాతాలు, మొబైల్‌ సేవలు మొదలైన వాటితో ఆధార్‌ అనుసంధానం గడువును దేశ అత్యున్నత న్యాయ స్థానం సుప్రీంకోర్టు వాయిదా వేసింది. చీఫ్ జస్టిస్ దీపాక్ మిశ్రా నేతృత‍్వంలోని జస్టిస్ ఎకె సిక్రీ, ఎఎం ఖాన్విల్కర్, డివై చంద్రకుడ్, అశోక్ భూషణ్‌తో కూడిన ఐదుగురు న్యాయనిర్ణేతల రాజ్యాంగ ధర్మాసనం దీనిపై తుది విచారణ పూర్తయ్యేంత వరకు ఎలాంటి డెడ్‌లైన్‌ ఉండేది లేదని తేల్చి చెప్పింది. అసలు బ్యాంకు ఖాతాలు, మొబైల్‌ లాంటి సేవలకు ఆధార్‌ లింకింగ్‌ తప్పనిసరి కాదని కూడా స్పష్టం చేసింది.

కాగా ఆధార్‌ మాండేటరీ, ఆధార్‌ గోప్యతల విషయంలో పలు పిటీషన్లపై విచారించిన సుప్రీం మంగళవారం ఈ కీలక ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు బ్యాంకు ఖాతా, మొబైల్‌, తత్కాల్‌ పాస్‌పోర్ట్‌ లాంటి సేవలకు ప్రత్యేక ఐడెంటిఫికేషన్ నంబర్ ఆధార్‌ తప‍్పనిసరి కాదని కూడా తెలపింది. కానీ.. ప్రభుత‍్వ సాంఘిక పథకాలకు మాత్రమే ఆధార్ అవసరమని పేర్కొంది.