పెన్నుని గన్నుగా చూపి…

ఫౌంటెన్ పెన్నుని గన్నుగా చూపించి విమానంలోని అందరిని బెదిరించాడు ఓ ప్రయాణికుడు. ఈ సంఘటన చైనాలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం… ఎయిర్‌ చైనాకు చెందిన విమానం హునాన్‌ ప్రావిన్స్‌లోని చాంగ్‌ షా విమానాశ్రయం నుంచి బీజింగ్ కు బయలుదేరింది. ఈ విమానంలో ప్రయాణిస్తున్న ఒక ప్రయాణికుడు తన దగ్గరున్న ఫౌంటెన్ పెన్నుని గన్నుగా చూపించి విమాన సిబ్బందిని బందీగా చేసుకునే ప్రయత్నం చేశాడు. ఈ ఘటనతో విమానంలోని ప్రయాణికులు అందరూ భయభ్రాంతులకు గురయ్యారు. ఈ సమాచారాన్ని పైలట్లు అధికారులకు తెలిపారు. అధికారుల సూచనల మేరకు విమానంను అత్యవసరంగా జెంగ్జౌ విమానాశ్రయానికి మళ్లించి ల్యాండ్ చేశారు. విమానాశ్రయంలోని భద్రతా బలగాలు విమానాన్ని అదుపులోకి తీసుకుని ప్రయాణికులను, సిబ్బందిని సురక్షితంగా బయటకు దించేశారు. అనంతరం నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ప్రయాణికులను మరో విమానంలో పంపారు.