సీఎం స‌ర్ ..? హోర్డింగులు నిషేధించినా?!

రోడ్ల‌కు ఇరువైపులా భారీ హోర్డింగుల్ని నిషేధిస్తూ ఇదివ‌ర‌కూ సుప్రీం తీర్పు వెలువ‌రించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ రూల్‌ని ఎవ‌రూ పాటించ‌డం లేద‌న్న‌ది వాస్త‌వం. సినిమా హోర్డింగులు చూస్తూ బైక్‌లు, కార్లు న‌డిపే మ‌హానుభావుల‌కు కొద‌వేం లేదు కాబ‌ట్టి, య‌థాత‌థంగా వీళ్ల‌ను దృష్టిలో పెట్టుకుని ప్ర‌తి సినిమాకి భారీ క‌టౌట్లు, హోర్డింగులు ప్ర‌ధాన కూడ‌ళ్ల‌లో ఏర్పాటు చేస్తున్నారు మేక‌ర్స్‌. వాళ్ల‌కు కావాల్సింది ప్ర‌చారం… జ‌నాల‌కు కావాల్సింది వినోదం కాబ‌ట్టి ఈ తంతు య‌థావిధిగానే సాగిపోతోంది.

తాజాగా మ‌హేష్ న‌టించిన `భ‌ర‌త్ అనే నేను` తెలుగు రాష్ట్రాలు స‌హా, ప్ర‌పంచ‌వ్యాప్తంగా అత్యంత భారీగా రిలీజ‌వుతోంది. ఆ క్ర‌మంలోనే ప్ర‌చార హోరు అదే తీరుగా ఉంది. భ‌ర‌త్ ప్ర‌చారానికి ఏకంగా 3కోట్ల మేర బ‌డ్జెట్‌ని కేటాయించార‌ట నిర్మాత‌లు. టీవీ చానెల్‌, ప‌త్రిక‌లు, రేడియో ప్ర‌క‌ట‌న‌లు స‌హా ర‌క‌ర‌కాల మార్గాల్లో ఈ డ‌బ్బును పెట్టుబ‌డిగా వెద‌జ‌ల్లుతున్నార‌ని తెలుస్తోంది. మ‌రోవైపు రోడ్ల‌కు ఇరువైపులా భారీ హోర్డింగులు ఏర్పాటు చేయ‌నున్నారట‌. ఒక్క హైద‌రాబాద్‌లో 300 హోర్డింగులు, తెలుగు రాష్ట్రాల్లో 500 వ‌ర‌కూ `భ‌ర‌త్ అనే నేను` హోర్డింగులు ఏర్పాటు చేస్తున్నార‌ట‌. గ‌తంలో దిల్లీ లో హోర్డింగులు తొల‌గించాలంటూ సుప్రీంకోర్టు సీరియ‌స్ అయ్యింది. రోడ్డుకు 75 మీట‌ర్ల లోపు అటూ ఇటూ ఎక్క‌డా హోర్దింగులు పెడితే జ‌రిమానా అంతే భారీగా ఉంటుంద‌ని హెచ్చ‌రించింది. ఆ త‌ర‌వాత మ‌ద్రాసు హైకోర్టు ఈ త‌ర‌హాలోనే చీవాట్లు పెట్టింది. అయితే తెలుగు రాష్ట్రాల్లో రూల్స్ పాటిస్తూనే ఈ హోర్డింగుల ఏర్పాటు ఉంటుందా? భ‌ర‌త్ అనే సీఎం రూల్స్ పాటిస్తున్నారా? అన్న‌ది తెలియాల్సి ఉందింకా.