చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టుకు గాయాల బెడద

ఐపీఎల్-11 సీజన్‌ ప్ర్రారంభం నుంచే కష్టాలను ఎదుర్కొంటుంది చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు. అయినా కూడా రెండు వరుస విజయాలను అందుకున్న చెన్నై.. అనూహ్యంగా నిన్న పంజాబ్ చేతిలో ఓడిపోయింది. ఈ ఆందోళనలో ఉన్న చెన్నై జట్టుకి మరో ఆందోళన కూడా మొదలైంది. చెన్నై జట్టు కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడటం అటు జట్టు యాజమాన్యాన్ని ఇటు అభిమానులను కలవరపెడుతోంది. చెన్నై కీలక ఆటగాళ్లు సురేశ్‌ రైనా, కేదార్‌ జాదవ్‌లు గాయాలతో టోర్నీకి దూరం అవడం.. తండ్రి మరణించడంతో సౌతాఫ్రికా బౌలర్‌ ఎంగిడి స్వదేశానికి వెళ్లిపోవడం జట్టుపై తీవ్ర ప్రభావం పడింది. ఇక కెప్టెన్ ధోని వెన్నునొప్పితో బాధపడటం చెన్నై జట్టు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోనుందా? అనే అనుమానం కలుగుతుంది. అయితే మ్యాచ్‌ ముగిసిన తర్వాత గాయంపై ధోనీ ఇచ్చిన వివరణ కాస్త ఉపశమనం కలిగించింది.

మ్యాచ్‌ ముగిసిన అనంతరం ధోని మాట్లాడుతూ… వెన్నునొప్పి బాధించింది. మ్యాచ్ మధ్యలో ఫిజియో సాయంతో కాస్త ఉపశమనం కలిగింది. ఈ నొప్పి మళ్లీ ఎపుడు తిరగబెడుతుందో చెప్పలేను. ఈ గాయాలేమి నాకు కొత్త కాదు. చిన్న గాయాలైనప్పుడు కూడా నొప్పిని భరిస్తూ ఆడగలను. దేవుడు నాకు ఆ శక్తిని ఇచ్చాడు. తర్వాతి మ్యాచ్‌కు ఐదు రోజుల గ్యాప్‌ ఉంది కాబట్టి కోలుకోవడానికి అవకాశం ఉంది అని అన్నాడు. ఏప్రిల్‌ 20న పుణె వేదికగా చెన్నై జట్టు రాజస్తాన్‌ తో తలపడనుంది.