కథువా బాధితులకు రక్షణ కల్పించండి..!

కథువాలో అత్యాచారం, హత్యకు గురైన ఎనిమిదేళ్ల బాలిక తల్లిదండ్రులకు, వారి తరఫున వాదిస్తున్న న్యాయవాదికి రక్షణ కల్పించాలని సర్వోన్నత న్యాయస్థానం జమ్ముకశ్మీర్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసులో విచారణను కశ్మీర్‌లో వద్దని ఛండీగఢ్‌కు తరలించాలని బాలిక తండ్రి సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు దీనిపై స్పందన తెలపాలని జమ్ముకశ్మీర్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఏప్రిల్‌ 27లోగా సమాధానాన్ని కోరింది.

కాగా రాష్ట్రంలో విచారణను ప్రభావితం చేసే అవకాశం ఉందని, తమకు రక్షణ లేదని బాలిక తండ్రి పిటిషన్‌లో పేర్కొన్న విషయం తెలిసిందే. కథువాలో న్యాయవాదులు కూడా వ్యతిరేకంగా ఉన్నారని, జమ్ములో పరిస్థితి చూస్తే విచారణ సజావుగా సాగేలా కనిపించడంలేదని బాలిక కుటుంబం తరఫు న్యాయవాది వివరించారు. అయితే… కేసులో అరెస్టైన నిందితులు ఈరోజు కోర్టులో హాజరయ్యారు. తాము ఎలాంటి తప్పు చేయలేదని.. తమకు నార్కో పరీక్ష నిర్వహించమని కోర్టును కోరారు. ట్రయల్‌ కోర్టు మాత్రం విచారణను ఏప్రిల్‌ 28కి వాయిదా వేసింది.