ఎంపీల పెన్షన్‌లపై పిటిషన్‌ ను కొట్టేసిన సుప్రీం..!

మాజీ పార్లమెంటేరియన్లకు ఇచ్చే పెన్షన్లకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. మాజీ ఎంపీలకు పెన్షన్లు, రవాణ భత్యం, మిగతా అంశాలకు సంబంధించిన అంశాలపై సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను జస్టిస్‌ చలమేశ్వర్‌, జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌లతో కూడిన ధర్మాసనం కొట్టేసింది. అయితే ఈ విషయానికి సంబంధించి తీర్పును కోర్టు ఈ ఏడాది మార్చి 7న రిజర్వ్ లో ఉంచినట్లు తెలుస్తుంది. ఎంపీలు పదవీ కాలం ముగిసినప్పటికీ వారు గౌరవ ప్రదంగా ఉండేందుకు పెన్షన్లు, ఇతర అలవెన్స్‌లు, సేవలు అందించడం సబబేనని కేంద్ర ప్రభుత్వం నాటి విచారణలో సర్వోన్నత న్యాయస్థానానికి వివరించింది.

కాగా ఎంపీల వేతనాలు, పెన్షన్లకు సంబంధించి నిర్ణయాలు తీసుకునేలా స్వతంత్ర యంత్రాంగాన్ని నియమించే అంశంపై కేంద్రం తమ వైఖరిని తెలియజేయాలని సుప్రీంకోర్టు గత ఫిబ్రవరిలోనే ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయ కూడా విదితమే. అయితే ఎన్జీవో ‘లోక్‌ ప్రహరి’ మాజీ ఎంపీల పెన్షన్ల విషయంపై కోర్టును ఆశ్రయించింది. అలహాబాద్‌ హైకోర్టు తమ పిటిషన్‌ కొట్టేయడంతో సుప్రీంను ఆశ్రయించింది.