ర‌ణ్‌వీర్‌, షాహిద్‌ల‌కు దాదాసాహెబ్ ఫాల్కే…

`ప‌ద్మావ‌త్` అసాధార‌ణ విజ‌యంలో కీల‌క పాత్ర‌ధారులు దీపిక ప‌దుకొన్‌, ర‌ణ‌వీర్ సింగ్‌, షాహిద్ క‌పూర్‌ల‌పై క్రిటిక్స్ ప్ర‌శంస‌ల జ‌ల్లులు కురిపించారు. అంత‌కుమించి ప్ర‌జ‌లు ఆయా పాత్ర‌ధారుల న‌ట‌ప్ర‌ద‌ర్శ‌న‌కు జేజేలు ప‌లికారు. ఇలాంటి గ్రేట్ ఎపిక్‌లో అంత గొప్ప న‌ట‌న క‌న‌బ‌రిచినందుకు ప్రేక్ష‌క‌దేవుళ్లు ఇచ్చిన అవార్డుల ముందు ఇంకేదీ నిల‌వ‌ద‌న్న‌ది అక్ష‌ర స‌త్యం.

అయితే న‌టుడికో నూలుపోగు అన్న చందంగా షాహిద్‌, ర‌ణ‌వీర్‌ల‌కు `దాదా సాహెబ్‌ ఫాల్కే ఎక్స్‌లెన్స్‌` అవార్డుల్ని ప్ర‌క‌టించారు. మహారావల్‌ రతన్‌ సింగ్ పాత్రలో షాహిద్‌, అల్లా ఉద్దీన్‌ ఖిల్జీ పాత్ర‌లో ర‌ణ‌వీర్ మెప్పించిన సంగ‌తి తెలిసిందే. క్రూర‌త్వం నిండిన ఖిల్జీగా ర‌ణ‌వీర్ ఎంత గొప్ప‌గా అభిన‌యించాడో, కూల్‌గా ఉండి రాజ‌సం ప్ర‌ద‌ర్శించే వీరాధివీరుడిగా షాహిద్ అంత‌కుమించిన గొప్ప అభిన‌యం ప్ర‌ద‌ర్శించాడు. అందుకే ఈ ఎక్స‌లెన్స్ అవార్డులు.. అన్న‌మాట‌! అయితే ఈ ఇద్ద‌రితో పాటు .. అనుష్క శర్మ, తమన్నా, రాణీ ముఖర్జీ, అదితిరావు హైదరి, రాజ్‌కుమార్‌ రావు, కృతిసనన్‌ కూడా ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు.