తెలంగాణ

స్టేషను ఘనపూర్
స్టేషను ఘనపూర్

రిజర్వుడ్ నియోజకవర్గమైన స్టేషన్ ఘన్ పూర్ లో సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ టి.రాజయ్య మూడోసారి గెలుపొందారు. తెలంగాణ తొలి క్యాబినెట్ లో ఆయన డిప్యూటీ సిఎం అయ్యే అవకాశాన్ని ముఖ్యమంత్రి కేసిఆర్ ఇచ్చారు. కానీ ఆ తర్వాత పరిణామాలలో పదవి కోల్పోయి  మాజీగా మిగిలారు. ఆయన బదులు వరంగల్ లోక్ సభకు ఎన్నికైన కడియం శ్రీహరి ఉప ముఖ్యమంత్రి అయ్యారు. 2014 సాధారణ ఎన్నికలో రాజయ్య తన సమీప ప్రత్యర్ధి , కాంగ్రెస్ అభ్యర్ధి విజయరామారావుపై 58829 ఓట్ల ఆధిక్యతతో విజయ ఢంకా మోగించారు. ఇక్కడ టిడిపి-బిజెపి కూటమి అభ్యర్ధిగా రంగంలోకి దిగిన డి.సాంబయ్యకు 20430 ఓట్లు వచ్చాయి. రాజయ్య 2009లో కాంగ్రెస్ లో గెలుపొంది టిఆర్ఎస్ లోకి వస్తే.. విజయరామారావు 2004లో టిఆర్ఎస్ లో గెలిచి శాసనసభ పక్ష నేతగా ఉండి, తదుపరి ఉప ఎన్నికలో ఓటమి చెందారు. తెలంగాణ ప్రకటన వెలువడిన తర్వాత కాంగ్రెస్ లోకి వెళ్లినా ఆయనకు ఫలితం దక్కలేదు. రాజయ్య తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్ కు రాజీనామా చేసి టిఆర్ఎస్ లో చేరారు. తదుపరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలో గెలిచారు. తిరిగి సాధారణ ఎన్నికలలో కూడా ఘన విజయం సాధించారు. గతంలో ఇక్కడ మూడుసార్లు ప్రాతినిధ్యం వహించిన టిడిపి నేత కడియం శ్రీహరి కూడా టిఆర్ఎస్ లో చేరి వరంగల్ నుంచి లోక్ సభ కు పోటీ చేసి విజయం సాధించడం విశేషం. స్టేషన్ ఘన్ పూర్ నుంచి 2008 ఉప ఎన్నికలో గెలుపొందిన టిడిపి సీనియర్ నేత కడియం శ్రీహరి , 2009 సాధారణ ఎన్నికలో ఓడిపోయారు. కడియం ఇక్కడ నుంచి మూడుసార్లు గెలిస్తే, గోకరామస్వామి రెండుసార్లు గెలిచారు. 2004లో టిఆర్ఎస్ శాసనసభ పక్షనేతగా వ్యవహరించిన డాక్టర్ జి.విజయరామారావు ఇక్కడ నుంచే ఒకసారి గెలిస్తే, మరోసారి మెదక్ జిల్లా గజ్వేల్ లో గెలిచారు. ఒకసారి సిద్దిపేట నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. 2008లో టిఆర్ఎస్ వ్యహాంలో భాగంగా పదవికి రాజీ నామా చేసి ఉప ఎన్నికలో పోటీ చేయగా ఆయన ఓడిపోయారు. అప్పుడు టిడిపి నేత కడియం శ్రీహరి గెలిచారు. 
1985లో ఇక్కడ గెలిచిన బొజ్జపల్లి రాజయ్య 1999లో పరకాలలో విజయం సాధించారు.  ఈ నియోజకవర్గం జనరల్ గా ఉన్నప్పుడు ఇక్కడ ఒకసారి గెలిచిన టి.హయగ్రీవాచారి , ధర్మసాగర్ లో రెండుసార్లు, హన్మకొండలో ఒకసారి గెలిచారు. హయగ్రీవాచారి తర్వాత కాలంలో నక్సల్స్ తూటాలకు బలైపోయారు. హయగ్రీవాచారి గతంలో పివి, మర్రి, అంజయ్య,కోట్ల క్యాబినెట్ లలో పని చేశారు. గోకా రామస్వామి 1978లో చెన్నారెడ్డి క్యాబినెట్ లో కొద్దికాలం పని చేసి ముఖ్యమంత్రితో పడక రాజీనామా చేసి సంచలనం సృష్టించారు. కడియం శ్రీహరి 1994లో ఎన్టీఆర్ క్యాబినెట్ లోను, తదుపరి చంద్రబాబు క్యాబినెట్ లోను పనిచేశారు.  డాక్టర్ జి.విజయరామారావు కొంతకాలం డాక్టర్ రాజశేఖర్ రెడ్డి క్యాబినెట్ లో పని చేశారు. 
స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గానికి 15సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ , కాంగ్రెస్ ఐ లు కలిసి ఆరుసార్లు, టిడిపి నాలుగుసార్లు, సిపిఐ ఒకసారి, టిఆర్ఎస్ రెండుసార్లు, ఇండిపెండెంట్లు ఒకసారి గెలిచారు. 

Activities are not Found
No results found.