పబ్బులు, బార్లపై పోలీసుల దాడులు...

హోరెత్తే శబ్ధాలతో.. మిణుకుమిణుకుమనే చీకటి వెలుగుల్లా చుక్కేసి.. చిందేసే మందుపాపలు, తాగుబోతులు రెచ్చిపోతుండటంతో పోలీసులు, ఎక్సైజ్ శాఖ దృష్టి సారించింది. మద్యం తాగిన మైకంలో పబ్బుల్లో గొడవలకు దిగడం.. బడాబాబులు, పారిశ్రామిక వేత్తల పుత్రరత్నాలు న్యూసెన్సు చేస్తున్నారనే ఫిర్యాదులు పెరగడంతో పోలీసులు, ఎక్సైజ్ శాఖ దృష్టి సారించింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని  పబ్బులు, బార్లలో రాత్రి ఎక్సైజ్ పోలీసులతో పాటు టాస్క్ ఫోర్స్ పోలీసులు, జూబ్లీహిల్స్ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. 

జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 36లోని అవెన్యూ, బార్ గ్రిల్ తదితర పబ్బుల్లో తనిఖీలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా మైనర్లకు మద్యం సరఫరా చేస్తున్నారా..? ప్రభుత్వ నిబంధనల్ని ఉల్లంఘిస్తున్నారా? అనే అంశాలపై విచారించారు. అర్థరాత్రి దాటినా చాలా బార్లు మూతబడకపోవడంతో.. పోలీసులు రంగప్రవేశం చేసి లోపలున్న మందు పాపలు, తాగుబోతుల్ని బయటకు పంపేశారు. పబ్బులు, బార్లలో ఫుల్లుగా మద్యం సేవిస్తూ.. నిర్ణీత సమయం దాటుతున్నా బయటకు రాని మందేసిన మైకంలో ఉన్న వారందర్నీ పోలీసు సిబ్బంది అక్కడి నుంచి పంపేశారు. చట్టాన్ని ఉల్లంఘించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఎక్సైజ్ పోలీసులు. అర్థరాత్రి 12 గంటలు దాటాక మద్యం సరఫరా చేయకూడదని.. అలా జరిగితే ఉపేక్షించబోమని హెచ్చరించారు.