మహారాష్ట్రలో కరోనా విలయ తాండవం...ఒక్కరోజులోనే 2940 పాజిటివ్‌ కేసులు

మహారాష్ట్రలో కరోనా విలయ తాండవం...ఒక్కరోజులోనే 2940 పాజిటివ్‌ కేసులు

మహారాష్ట్రలో కరోనా.. మహా ప్రళయం సృష్టిస్తోంది. కొత్తగా నిన్న ఒక్కరోజే.. 2వేల 940 కేసులు నమోదు కాగా.. 24గంటల్లో ఇన్ని కేసులు రావడం ఇదే తొలిసారి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 44వేల 582కి పెరిగింది. ఇప్పటివరకు కరోనాతో 15వందల 17 మంది ప్రాణాలు కోల్పోయారు.అటు, రాజధాని ముంబయిలో కొత్తగా.. 17వందల 51 కేసులు నమోదయ్యాయి. దీంతో సిటీలో కేసుల సంఖ్య 27వేల68కి పెరిగింది. కరోనాతో మరో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో నగరంలో మృతుల సంఖ్య 909కి పెరిగింది. ఇప్పటికి వరకూ 7వేల 80 మంది డిశ్చార్జి అయ్యారు.ధారావిలో కొత్తగా 53 పాజిటివ్‌ కేసులు గుర్తించారు. అక్కడ మొత్తం కేసుల సంఖ్య 14వందల 78కి పెరిగింది. ఈ ప్రాంతంలో ఇప్పటివరకు 57 మంది కరోనాతో చనిపోయారు..

మరోవైపు ముంబైలో పోలీసులపై కరోనా పగబట్టి కనిపిస్తోంది. 48 గంటల్లోనే 278 పోలీసులకు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. మహారాష్ట్రలో ఉగ్రరూపం దాల్చిన కరోనా.. పోలీసుశాఖలో కలకలం రేపుతోంది. ఇప్పటివరకు 16వందల 66మంది పోలీసులకు ఈ వైరస్‌ సోకగా..వీరిలో 16మంది ప్రాణాలు కోల్పోయారు. వైరస్‌ బారినపడిన పోలీసు బాధితుల్లో 473మంది ఇప్పటికే కోలుకోగా మరో 11వందల 77మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.