రైల్వే ప్రయాణికుల నుంచి అనూహ్య స్పందన.. 2 గంటల్లోనే...!

రైల్వే ప్రయాణికుల నుంచి అనూహ్య స్పందన.. 2 గంటల్లోనే...!

దేశవ్యాప్తంగా జూన్‌ 1 నుంచి 200 ప్రత్యేక రైళ్లు నడుస్తాయని ప్రకటించిన రైల్వేశాఖ మరికొన్ని రైళ్లను పట్టాలు ఎక్కించేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం నడుపుతున్న 30 ప్రత్యేక రైళ్ల బుకింగ్ కు సంబంధించి ఇండియన్ రైల్వే కొన్ని మార్పులు చేసింది. అడ్వాన్స్ రిజర్వేషన్ పీరియడ్-ఏఆర్‌పీను ప్రస్తుతమున్న 7రోజుల నుంచి 30రోజుల వరకు పెంచింది. ఇప్పటికే ఆన్‌లైన్‌లో ముందస్తు రిజర్వేషన్‌ కు ప్రయాణికుల నుంచి భారీ స్పందన వచ్చింది.  కేవలం రెండున్నర గంటల్లో 4 లక్షల టికెట్లు బుక్ అయ్యాయి. తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌, గోదావరి, హుస్సేన్‌సాగర్‌, ఫలక్‌నుమా, గోల్కొండ తదితర ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో ఆరోజు ప్రయాణాలకు టికెట్లు అరగంట వ్యవధిలోనే అయిపోయాయి. 

ఇక సికింద్రాబాద్‌ నుంచి విశాఖపట్నం వెళ్లడానికి ఫలక్‌నుమా, గోదావరి, కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లున్నప్పటికీ ఒక్క దాంట్లోనూ ఖాళీ లేదు. దేశవ్యాప్తంగా దాదాపు లక్షన్నర ఉమ్మడి సేవా కేంద్రాలు, టికెట్‌ ఏజెంట్ల ద్వారానూ రిజర్వేషన్‌కు అనుమతించింది రైల్వే శాఖ. ప్రత్యేక రైళ్లలో టికెట్ల రిజర్వేషన్లకు తెలంగాణలో 18 రైల్వేస్టేషన్లు, ఆంధ్రప్రదేశ్‌లో 44 రైల్వేస్టేషన్లతో పాటు జోన్‌ పరిధిలోకి వచ్చే మరో 11 చోట్ల  రెగ్యులర్‌ బుకింగ్‌ కౌంటర్లను తెరిచింది దక్షిణమధ్య రైల్వే. జ్వరం, దగ్గు, జలుబు లక్షణాలు లేనివారినే ప్రయాణాలకు అనుమతిస్తారు. వారివద్ద ఆరోగ్య సేతు యాప్‌ ఉన్న మొబైల్‌ ఉండాలి.