ఢిల్లీలో భారత మాజీ క్రికెటర్‌పై దాడి

ఢిల్లీలో భారత మాజీ క్రికెటర్‌పై దాడి

ప్రస్తుత ఢిల్లీ, డిస్ట్రిక్ట్స్ క్రికెట్ అసోషియేషన్ (డీడీసీఏ) సీనియర్ సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌, టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ అమిత్ భండారిపై అల్లరి మూక దాడి చేసింది. ఢిల్లీ అండర్‌-23 జట్టులోకి తనను ఎంపిక చేయనందుకు కక్ష పెంచుకున్న అనూజ్‌ దేడా అనే యువకుడే తన స్నేహితులతో కలిసి ఈ దాడికి పాల్పడ్డాడు. ఢిల్లీలోని సెయింట్‌ స్టీఫెన్స్‌ మైదానంలో ప్రాక్టీస్‌ సెషన్‌ను భండారి పరిశీలిస్తుండగా.. హాకీ స్టిక్స్, ఇనుప రాడ్లు, సైకిల్‌ చైన్లతో ఆయనపై దాడి చేశారు. పారిపోయేందుకు భండారి ప్రయత్నించినా.. వెంటాడి మరీ కొట్టారు. వీరి దాడిలో అమిత్ భండారి తల, చెవి భాగంలో గాయాలయ్యాయి. అనూజ్‌ దేడాను పోలీసులు అరెస్టు చేసి కేసు నమోదు చేశారు.  

2000-2004 మధ్య రెండు వన్డేల్లో భారత జట్టుకు భండారి ప్రాతినిధ్యం వహించాడు. ఢిల్లీ తరఫున రంజీల్లో 95 మ్యాచ్‌లాడి 314 వికెట్లు తీశాడు. దాడిని మాజీ క్రికెటర్లు బిషన్‌ సింగ్‌ బేడీ, వీరేంద్ర సెహ్వాగ్‌, గౌతమ్‌ గంభీర్‌ తీవ్రంగా ఖండించారు.