కేసీఆర్‌ నా గాడ్ ఫాదర్ అనుకున్నా... కంట తడి పెట్టిన బాబూమోహన్

కేసీఆర్‌ నా గాడ్ ఫాదర్ అనుకున్నా... కంట తడి పెట్టిన బాబూమోహన్

టీఆర్ఎస్ టికెట్ దక్కకపోవడంతో పార్టీని వీడి భారతీయ జనతా పార్టీలో చేరిన తాజా మాజీ ఎమ్మెల్యే బాబూమోహన్... ఆందోల్‌ టికెట్‌ తనకు కేటాయించకుండా తనకు అన్యాయం చేశారని కన్నీరుమున్నీరయ్యారు. సంగారెడ్డిలో ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆయన... టీఆర్ఎస్ తాజాగా బరిలోకి దించిన క్రాంతి కిరణ్ ఏనాడు టీఆర్ఎస్ కార్యక్రమాలకు కూడా హాజరుకాలేదని ఆరోపించారు. లోకల్ అభ్యర్థికే టికెట్ ఇస్తామంటే... గతంలో నాకెందుకు టికెట్ ఇచ్చారని కేసీఆర్‌ను ప్రశ్నించిన బాబుమోహన్... నేనేం తప్పు చేశాను... చెప్పుడు మాటలు విని టికెట్ ఇవ్వరా? కేసీఆర్ ను నా గాడ్ ఫాదర్ అనుకున్నా... నేనేం తప్పుచేసానో? కేసీఆర్ వేసిన శిక్ష న్యాయమా? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం చెప్పులు వేసుకునే టైమ్ కూడా ఇవ్వలేదన్న బాబుమోహన్.... ఉగ్రవాదుల కంటే కఠిన శిక్ష వేశారని, ఎమ్మెల్యే గా 25 ఏళ్ల క్రితం అయిన నేను ఇంకా లోకల్ కాదా? నేను తెలంగాణలోనే పుట్టాను... నేను ఎలా చూసినా లోకల్ లే అన్నారు. నాలాంటి వాడికి అన్యాయం చేస్తే ఆ దేవుడు చూసుకుంటారంటూ శాపనార్థాలు పెట్టిన బాబుమోహన్... బీసీ,ఎస్సీలకు కేసీఆర్ ఏంలాభం చేశారని ప్రశ్నించారు. బీసీ, దళితులను ఆదరించిన పార్టీ బీజేపీయేనని... దళితున్ని రాష్ట్రపతిని చేసిన ఘనత బీజేపీదే అన్నారు. మళ్లీ నరేంద్ర మోడీయే ప్రధాని అవుతారని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ తనకు తీవ్ర అన్యాయం చేశారంటూ మీడియా సమావేశంలో కంట తడి పెట్టారు బాబూమోహన్.