మోడీకి చంద్రబాబు ఘాటు లేఖ

మోడీకి చంద్రబాబు ఘాటు లేఖ

'ఎన్నికల ముందు తిరుపతి, నెల్లూరు, భీమవరం, మదనపల్లి, గుంటూరు సభలలో మీరు చెప్పిన మాటలు ఒకసారి గుర్తు చేసుకోండి. అమరావతి రాజధాని శంకుస్థాపన సందర్భంలో ఢిల్లీ కూడా చిన్నబోయే రాజధానిని నిర్మించేందుకు సహకరిస్తానని మీరిచ్చిన మాట గుర్తుందా? రాష్ట్రానికి నమ్మకద్రోహం చేసి ఇప్పుడు తీరిగ్గా వస్తున్నారా?' అని ప్రధాని మోడీని ఏపీ సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. మోడీ ఏపీ టూర్‌ నేపథ్యంలో ఘాటు విమర్శలతో ఆయనకు బాబు లేఖ రాశారు. ప్రధానమంత్రి అయిన వెంటనే అంతకు ముందు చేసిన వాగ్దానాలన్నింటినీ మోడీ మరచిపోయారని అన్నారు.

గత ఐదేళ్లుగా ఏపీకి కేంద్ర ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని ఇక్కడి ప్రజలు తీవ్రంగా నిరసిస్తున్నారని.. తీరని ధర్మాగ్రహంతో ఉన్నారని బాబు చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని హేతుబద్ధత లేకుండా విభజించడంలో బీజేపీ పాత్ర కూడా ఉందన్న ఆయన.. విభజన చట్టంలో పొందుపరచిన పలు అంశాల అమలులో తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శించడం తమ రాష్ట్ర ప్రజల గుండెలను గాయపరచిందని పేర్కొన్నారు. అన్నివిధాలుగా ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేస్తానని చెప్పి 'నీరు-మట్టి' ఇచ్చి మోడీ వెళ్లారని.. దురదృష్టవశాత్తూ ఆయన మాటలను ఆయనే 'గజనీ'లా మరచిపోయారని అన్నారు.

రాష్ట్ర  ప్రజల మనసుల్లో ప్రత్యేక హోదా ఆకాంక్షను సాధించుకునేందుకు సంవత్సర కాలంగా ధర్మపోరాటాలు చేస్తున్నా... మీరు నిమ్మకు నీరెత్తినట్టు ప్రవర్తించడం బాధ్యతారాహిత్యం కాదా? విభజన హామీల అమలు కోసం నేను మీ వద్దకు, మీ మంత్రుల వద్దకు 29 సార్లు వచ్చి విజ్ఞప్తులు చేసిన విషయం మీకు గుర్తుందా? అని ప్రశ్నించారు. ముఖ్యంగా ప్రత్యేక హోదా ప్రకటించాలని అనేకసార్లు కోరినప్పటికీ 14వ ఆర్థిక సంఘం సిఫారసులు అడ్డువస్తున్నాయని నమ్మబలికి దాని స్థానంలో ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారని ఆసహనం వ్యక్తం చేశారు. 

విశాఖ రైల్వేజోన్‌ను ప్రకటించకుండా కావాలని వాయిదాలు వేస్తున్నారన్న బాబు.. కేంద్రం కోరిన భూమి, గనులు, రాయితీలు కల్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చినప్పటికీ కడప ఉక్కు కర్మాగారం ఇంకా ఇవ్వలేదని గుర్తుచేశారు. కేవలం ఆరు నెలల్లో తొలి దశ పూర్తి చేయాలని విభజన చట్టంలో నిర్దేశించినప్పటికీ దుగరాజపట్నం పోర్టుపై ఇంత వరకు ఏ నిర్ణయమూ ప్రకటించకపోవడం సరికాదన్నారు. .
పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సకాలంలో నిధులు విడుదల చేయకుండా, పోలవరం రివైజ్డ్ డీపీఆర్‌కు ఆమోదం తెలపకుండా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన సుమారు రూ.4వేల కోట్ల నిధులను తిరిగి చెల్లించకుండా తమూ ఆర్థిక భారాన్ని మోపుతున్నారని బాబు తప్పుబట్టారు. ఇలా అరకొర నిధులిస్తే అవి పూర్తిచేయడానికి కనీసం 30 ఏళ్లు పడుతుందనే విషయం మీకు తెలియనిదా..? కాకినాడలో హెచ్‌పీసీఎల్ రిఫైనరీ ప్రారంభించాలని చట్టంలో ఉన్నప్పటికీ కుంటిసాకులతో నిరాకరించడం మా పట్ల మీ నిర్లక్ష్య ధోరణి కాదా? అని మోడీని ప్రశ్నించారు బాబు.

కేవలం రూ.1500 కోట్లతో ఢిల్లీని తలదన్నే రాజధాని నిర్మాణం సాధ్యమవుతుందా? నీతిఆయోగ్ సిఫారసు చేసినప్పటికీ వెనుకబడిన ఏడు జిల్లాలకు గాను రాష్ట్ర ఖజానాకు జమచేసిన రూ.350 కోట్లను ఏకపక్షంగా, రాష్ట్ర అనుమతి లేకుండా తిరిగి వెనక్కి తీసుకోవడం భారత సమాఖ్య స్ఫూర్తికి గొడ్డలిపెట్టు కాదా?  అన్నీ తెలిసీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల న్యాయమైన, చట్టపరమైన హక్కులను నెరవేర్చకుండా మొండిచేతులతో రావడం మీకు ధర్మమా? అని ప్రశ్నించారు.

ఇంతకాలంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేస్తున్న ఆందోళన, వారి మనోభావాలు, వారి ధర్మాగ్రహం గమనించాలని సూచించిన చంద్రబాబు..  ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కుగా గుర్తించి, రాజ్యసభలో అప్పటి ప్రధానమంత్రి ఇచ్చిన రాయితీలతో కూడిన ప్రత్యేక హోదా హామీని, ఇతర హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.