రైతును ఓటు బ్యాంకుగానే చూశారు-మోదీ

రైతును ఓటు బ్యాంకుగానే చూశారు-మోదీ

కాంగ్రెస్ పార్టీపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్రస్థాయిలో మాటల దాడి చేశారు. కాంగ్రెస్ రైతాంగాన్ని మోసం చేసిందని ఆరోపించిన ప్రధాని... ఓ కుటుంబ ప్రయోజనాల కోసం రైతులను ఓటుబ్యాంకుగానే చూస్తున్నారని మండిపడ్డారు. పంజాబ్ ముక్తసర్ జిల్లాలోని మాలోత్‌లో నిర్వహించిన కిసాన్ కల్యాణ్ ర్యాలీలో పాల్గొన్న భారత ప్రధాని... రైతులందరికీ శిరసు వంచి నమస్కరిస్తున్నాను... తమ ప్రభుత్వం రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటోందన్నారు. తమ హయాంలో రైతులందరూ సుఖంగా నిద్ర పోతున్నారన్న మోడీ... కానీ కాంగ్రెస్‌తో పాటు ఆ పార్టీ మిత్రపక్షాలకు మాత్రం నిద్ర రావడం లేదని విమర్శించారు. 

కాంగ్రెస్ హయాంలో తీవ్రమైన కష్టాల్లో ఉన్న రైతులు సౌకర్యవంతమైన జీవితాన్ని ఊహించలేకపోయారన్న ప్రధాని మోడీ... కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వాల విధానాలతో దశాబ్దాలుగా రైతులు నిరాశకు గురై జీవితాన్ని గడపారన్నారు. అమలు సాధ్యం కానీ వాగ్దానాలు ఇచ్చి రైతులను కాంగ్రెస్ మోసం చేసిందని ధ్వజమెత్తిన ప్రధాని... రైతులందరినీ ఓటు బ్యాంకు కోసమే కాంగ్రెస్ వాడుకుందన్నారు. కానీ, బీజేపీ ప్రభుత్వం మాత్రం 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే ధ్యేయంగా పెట్టుకుందని వెల్లడించారు. ఇక మూడేళ్లలో వ్యవసాయ ఉత్పత్తులను రైతులు రెట్టింపు చేశారని తెలిపారు ప్రధాని... వరితో పాటు మరో 13 ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధరను పెంచేందుకు నిర్ణయం తీసుకోవడంతో రైతులకు సమస్యలే ఉండబోవన్నారు.