రేపిస్థాన్ ట్వీట్ పై రగులుతున్న రగడ

రేపిస్థాన్ ట్వీట్ పై రగులుతున్న రగడ

వివాదాస్పద ‘రేపిస్థాన్‘ ట్వీట్ తో కశ్మీర్ మొట్టమొదటి ఐఏఎస్ టాపర్ షా ఫైజల్ ని పుట్టెడు కష్టాలు చుట్టుముట్టాయి. 2010 బ్యాచ్ అధికారి అయిన షా ఫైజల్ పై జమ్ముకశ్మీర్ ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలు ప్రారంభించింది. ఫైజల్ కు పంపిన నోటీసులో ఆయన పూర్తి నిజాయితీతో, నిబద్ధతతో కర్తవ్యాన్ని నిర్వహించడంలో విఫలమయ్యారని ఆరోపించారు.  అయితే ఫైజల్ కు జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా గట్టిగా మద్దతు తెలుపుతున్నారు. ఫైజల్ పై కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని ఒమర్ తన ట్వీట్ లో విమర్శించారు.

దేశంలో పెరుగుతున్న అత్యాచార ఘటనలపై ఆందోళన వ్యక్తం చేస్తూ షా ట్వీట్ చేశారు. ‘పితృస్వామ్యం+జనాభా+నిరక్షరాస్యత+మద్యం+పోర్న్+టెక్నాలజీ+అరాచకత్వం=రేపిస్థాన్‘ అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ని వివాదాస్పదంగా ఉందని భావించిన కేంద్ర ప్రభుత్వం, అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా షా ఫైజల్ అభిప్రాయానికి తన మద్దతు తెలిపారు. సిబ్బంది శిక్షణా విభాగం షా ఫైజల్ ను సివిల్ సర్వీసెస్ నుంచి బయటికి పంపించాలని నిర్ణయించుకున్నట్టుగా తోస్తోందని ట్వీట్ చేశారు. నోటీసు చివరి పేజీ చివరి వాక్యం అత్యంత దారుణమైందన్నారు. షా ఫైజల్ నిబద్ధత, నిజాయితీలను ప్రశ్నించడం అన్యాయమని పేర్కొన్నారు. ఒక వ్యంగ్య ట్వీట్ చేసినందుకు ఏ విధంగా అవినీతిపరుడని ముద్ర వేస్తారని ప్రశ్నించారు. 

అటు షా ఫైజల్ తనకు నోటీసులు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై శాఖాపరంగా తీసుకోనున్న క్రమశిక్షణ చర్యలపై కానీ, ఉద్యోగం పోతుందనే భయం కానీ తనకు లేదని చెప్పారు. ప్రభుత్వోద్యోగి అనేది ఒక ముసుగని ఉద్యోగులు దాని వెనుక అనామకులుగా బతకాలని ప్రభుత్వం కోరుకుంటున్నట్టుందని అభిప్రాయపడ్డారు. తమ చుట్టుపక్కల ఏం జరిగినా కళ్లు మూసుకుని కూర్చోవాలి తప్ప దానిపై మాట్లాడటం, వాదించడం తప్పని చెప్పడమే తనకు పంపిన నోటీసుల ఉద్దేశంగా కనిపిస్తోందన్నారు. దీనిని మార్చాల్సిన అవసరం ఉందని షా ఫైజల్ అన్నారు.