వాహనాల ధృవపత్రాలు అవసరం లేదు

వాహనాల ధృవపత్రాలు అవసరం లేదు

ట్రాఫిక్ పోలీసులు వాహనాలు తనిఖీ చేసేటపుడు ఒరిజినల్ పత్రాలు లేవని ఇక భయపడనక్కర్లేదు. తనిఖీ జరిపేటపుడు  వాహనదారులు ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, బీమా పత్రాలు చూపాల్సిన అవసరం లేదని కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. అసలు ధ్రువపత్రాలను చూపాలని బలవంతం చేయరాదని ట్రాఫిక్ పోలీసులను ఆదేశించింది. పత్రాల డిజిటల్ కాపీలు చూపిస్తే చాలని తెలిపింది. డిజీలాకర్ లేదా ఎంపరివాహన్ లాంటి ప్రభుత్వ యాప్‌ల ద్వారా పొందిన ఎలక్ట్రానిక్ ధ్రువపత్రాలు కూడా చెల్లుబాటవుతాయి. వాహనదారులు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినపుడు ఒరిజినల్ డాక్యుమెంట్స్ లేకపోతే మొబైల్ ద్వారా సెంట్రల్ డేటాబేస్‌లోకి లాగిన్ అయి క్యూఆర్ కోడ్‌ రికార్డు చేయాలని సూచించింది. 

వాహనదారులు వివిధ సందర్భాలలో తమ డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీలను పోగొట్టుకుంటారు. ఆ పత్రాలను గుర్తించడంలో రవాణాశాఖ వైఫల్యంపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దీంతో కేంద్ర తాజాగా కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. దీనికి సంబంధించి అన్ని రాష్ట్రాలకు, రవాణా శాఖకు పలు సూచనలు ఇచ్చింది. వాటి ప్రకారం ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినప్పుడు, తనిఖీల సమయంలో ఒరిజనల్ డాక్యుమెంట్స్ అవసరం లేదు. వాటికి బదులు వాహన్, సారథి డేటాబేస్ ద్వారా వివరాలు సేకరించాలి. 

ఐటీ చట్టం 2000 ప్రకారం.. డిజీలాకర్, ఎంపరివాహన్‌లో లభించే వివరాలు అసలు పత్రాలతో సమానంగా గుర్తించబడతాయని కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ తెలిపింది. మోటార్ వాహనాల చట్టం 1988 కూడా డిజిటల్ డాక్యుమెంట్స్ రవాణా శాఖ జారీచేసిన ధ్రుపత్రాలుగా పరిగణిస్తుందని పేర్కొంది. డిజీలాకర్ యాప్ అన్ని ఓఎస్ లకు అందుబాటులో ఉంటుందని, ఎంపరివాహన్ ఆండ్రాయిడ్ ఫోన్లకు మాత్రమే పరిమితమని స్పష్టం చేసింది. మరో వారం పది రోజుల్లో ఐఓఎస్ ఫోన్లకు అందుబాటులోకి తెస్తామని తెలిపింది.