అంబానీకి మరోసారి ఈడీ నోటీసులు

అంబానీకి మరోసారి ఈడీ నోటీసులు

రిలయన్స్ గ్రూప్ అధినేత అనిల్ అంబానీకి మరోసారి నోటీసులు జారీ చేసింది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), మనీలాండరింగ్ కేసులో విచారణకు హాజరుకావాల్సిందిగా నోటీసుల్లో పేర్కొంది ఈడీ. ఈ నెల 19వ తేదీన విచారణకు హాజరుకావాల్సిందిగా నోటీసుల్లో పేర్కొంది ఈడీ. కాగా, సంక్షోభంలో కూరుకుపోయిన ఎస్ బ్యాంక్ నుంచి పెద్ద మొత్తంలో లోన్‌ తీసుకున్న వారిలో అనిల్ అంబానీ ఒకరు.. అంబానీ గ్రూప్ కంపెనీలు సుమారు రూ .12,800 కోట్ల రుణాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించలేదు. ఈ కేసులో ఇప్పటికే ఓసారి అనిల్ అంబానీకి నోటీసులు ఇచ్చిన ఈడీ.. తాజాగా మరోసారి సమన్లు పంపింది. తొలి నోటీసుల ప్రకారం 60 ఏళ్ల అంబానీ.. ఇవాళ ముంబైలోని బల్లార్డ్ ఎస్టేట్ ప్రాంతంలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కార్యాలయంలో హాజరుకావాల్సి ఉంది.. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఇవాళ హాజరు నుండి అనిల్ అంబానీ మినహాయింపు కోరినట్లు అధికారులు తెలిపారు. దీంతో.. ఈ నెల 19వ తేదీన రావాల్సిందిగా నోటీసులు ఇచ్చారు. ఇక, ఎస్ బ్యాంక్ కేసులో ఎస్‌ఎల్ గ్రూప్ చైర్మన్ సుభాష్ చంద్రకు కూడా ఈడీ నోటీసులు ఇచ్చింది. జెట్ ఎయిర్‌వేస్ మాజీ అధినేత నరేష్ గోయల్‌కు కూడా సమన్లు అందాయి. అనిల్ అంబానీతో సహా మొత్తం 18 మందికి నోటీసులు జారీ చేసింది ఈడీ.