తాజ్ మహల్ ను మీరే కూల్చేయండి..

తాజ్ మహల్ ను మీరే కూల్చేయండి..

తాజ్  మహల్ సంరక్షణలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న ప్రభుత్వాల వైఖరిని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. భారత దేశానికి తలమానికం వంటి చారిత్రక కట్టడాన్ని కాపాడలేకపోతే కూల్చేయండని ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వం, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తాజ్ ను బాగు చేస్తాయనన్న ఆశలేదని అత్యున్నత న్యాయస్థానం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇప్పటికైనా ఆ అద్భుత కట్టడాన్ని పరిరక్షించకపోతే దాన్ని మూసివేస్తామని హెచ్చరించింది. ప్రధానంగా  కాలుష్య సమస్యను ఎదుర్కొంటున్న పురావస్తు కట్టడానికి పరిష్కార మార్గాలు వెతకడంలో ప్రభుత్వాలు ఎందుకు నిర్లక్ష్యం చూపుతున్నాయని న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. ప్రభుత్వ ఉదాసీనత వల్ల దేశానికి కలిగే నష్టాన్ని ఎలా భర్తీ చేస్తారని ప్రశ్నించింది. ప్రపంచ ప్రసిద్ధ తాజ్‌మహల్ నిర్వహణ లోపాలపై దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా ప్రభుత్వ తీరును సుప్రీంకోర్ట్ తీవ్రంగా తప్పుబట్టింది. 

తాజ్ పరిరక్షణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఆర్కియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా నిర్లిప్తతపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘తాజ్ మహల్‌ను సంరక్షించుకోరా? మీరే దానిని నాశనం చేస్తారా? ’అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్ మహల్ ని చూసేందుకు దేశవిదేశాల నుంచి వేలాదిగా సందర్శకులు తరలివస్తారు. దీంతో ప్రభుత్వ ఖజానాకు విదేశీ మారక నిల్వలు జమ అవుతాయి. దేశ ఆర్థిక పరిపుష్ఠికి దన్నుగా నిలుస్తున్న కట్టడంపై ఎంత శ్రద్ధ చూపాలంటూ సుప్రీంకోర్ట్ ధర్మాసనం నిలదీసింది. టీవీ టవర్ మాదిరిగా ఉండే పారిస్‌లోని ఈఫిల్ టవర్ కన్నా మన తాజ్‌మహలే అద్భుతమైన నిర్మాణమని న్యాయమూర్తులు కొనియాడారు.