తెలంగాణ ఉద్యోగుల్లో కొత్త ఆశలు.. శుభవార్త ఉందా మరి..?

తెలంగాణ ఉద్యోగుల్లో కొత్త ఆశలు.. శుభవార్త ఉందా మరి..?

లాక్‌డౌన్ కారణంగా కొన్నాళ్లు అన్ని వ్యవస్థలూ స్తంభించడంతో... ప్రభుత్వానికి వచ్చే ఆదాయం పూర్తిగా పడిపోయింది. దీంతో ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాల్లో కోత పెట్టింది తెలంగాణ సర్కారు. ఉన్నతాధికారుల వేతనాల్లో భారీగానే కోత పెట్టి... మిగిలిన వారి జీతాల్లో 50 శాతం కోత విధించింది. కరోనాపై పోరులో ముందుండి పనిచేసిన వైద్య, పోలీసు సిబ్బందికి పూర్తిస్ధాయిలో వేతనం ఇవ్వటంతో పాటు అదనంగా ప్రోత్సాహకాలు కూడా ఇచ్చారు. ప్రభుత్వ ఆలోచనకు కొన్ని ఉద్యోగ సంఘాలు కూడా అండగా నిలవడంతో... రెండు నెలలుగా చాలా మందికి సగం జీతమే వచ్చింది. ఇప్పుడు మే నెల వేతనాలకు గడువు దగ్గర పడుతుండటంతో... ఈసారి జీతాల పరిస్ధితి ఏంటనే చర్చ తెరమీదకు వచ్చింది. ఇప్పుడు లాక్ డౌన్ నుంచి మినహాయింపులు రావటం... కార్యకలాపాలు కూడా పుంజుకోవటంతో ప్రభుత్వానికి ఆదాయం వస్తోంది కాబట్టి... ఈ నెల పూర్తిస్ధాయి వేతనం వస్తుందనే ఆశతో ఉన్నారు.

ఉపాధ్యాయ సంఘాలు ఏప్రిల్‌లోనే పూర్తి జీతం కావాలని డిమాండ్‌ చేశాయి. ఇప్పుడు పేపర్ వాల్యేయేషన్ జరుగుతుండటం, త్వరలో పదో తరగతి పరీక్షలు కూడా ప్రారంభం కానుండటంతో... ఉపాధ్యాయ సంఘాల డిమాండ్‌ను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందేమో అనే చర్చ కూడా జరుగుతోంది. ఒకవేళ పూర్తి జీతం వస్తే... గత రెండు నెలల్లో కోత పడ్డ 50 శాతం వేతనాలను కూడా త్వరగా చెల్లించేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని... సీఎస్‌ను కలిసి విజ్ఞప్తి చేయాలని అనుకుంటున్నారు... ఉద్యోగ సంఘాల నాయకులు. ముందు ఈ నెల జీతం పూర్తిగా పడితే... బకాయిల సంగతి తరువాత తేల్చుకోవచ్చనే అభిప్రాయంతో ఉన్నారు ఉద్యోగ సంఘాల నాయకులు. మరి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఏదేమైనా ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెబుతుందేమోనని ఎదురుచూస్తున్నారు ఉద్యోగులు.