చేనేత వస్తువులపై జీఎస్టీ ఎత్తివేత?

చేనేత వస్తువులపై జీఎస్టీ ఎత్తివేత?

పన్ను ఎత్తివేసినా.. పన్ను వసూళ్ళపై పెద్దగా ప్రభావం చూపని రంగాల వస్తువులపై జీఎస్టీ పూర్తిగా ఎత్తివేయాలని కేంద్రం భావిస్తోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను పెంచడంతో పాటు ప్రజల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని చేనేత వస్తువులు, శానిటరీ నాప్‌కిన్స్‌పై పన్ను తగ్గించడం లేదా పూర్తిగా ఎత్తివేయాలని జీఎస్టీ కౌన్సిల్‌ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నెల 21వ తేదీన జీఎస్టీ కౌన్సిల్‌ భేటీ కానుంది. ఈ సమావేశంలో ఈ అంశాలపై వివిధ రాష్ట్రాల అభిప్రాయం తీసుకుని.. తుది నిర్ణయం తీసుకోవాలని కేంద్రం భావిస్తోంది. చేతివృత్తుల వస్తువులపై కూడా పన్ను ఎత్తివేసే అవకాశముంది. ప్రస్తుతం వీటిపై 12 శాతం పన్ను విధిస్తున్నారు. ఎన్నికలు సమీస్తున్న తరుణంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను దృష్టి పెట్టుకుని  ఈ వస్తువులపై  పన్ను పూర్తిగా ఎత్తివేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది.