దర్యాప్తునకు జగన్ సహకరించడం లేదు

దర్యాప్తునకు జగన్ సహకరించడం లేదు

వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నాయకుడు జగన్ మోహన్ రెడ్డిపై దాడికి సంబంధించిన దర్యాప్తులో సహకరించడంలేదని ఏపీ అడ్వకేట్ జనరల్ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. రక్తం మరకలున్న చొక్క ఇంత వరకు దర్యాప్తు అధికారులకు అందించలేదని, సీఆర్పీసీ 160 సెక్షన్ కింద వాంగ్మూలం ఇవ్వడానికి నిరాకరించారని తెలిపారు. అలాగే విమానాశ్రయాల్లో భద్రతపై సీబీఐ దర్యాప్తు చేయించాలని అనిల్ కుమార్ మరో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. చీఫ్ జస్టిస్ టీబీఎన్ రాధాకృష్ణన్, జస్టిస్ ఎస్వీ భట్ లతో కూడిన ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చాయి. వాదనలు మొదలుకాగానే జగన్ పై దాడిని చిన్నదిగా డీజీపీ మీడియాకు చెప్పారని, వైసీపీ కార్యకర్తే సానుభూతి కోసం దాడి చేశారని సీఎం ప్రకటించారని, ఎటువంటి విచారణ జరగక మునుపే ఇలాంటి ప్రకటనల వల్ల తమకు రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలపై మ్మకం పోయిందని పిటిషనర్ల తరపున న్యాయవాదులు తెలిపారు. అయితే బాధితుడే కోర్టును ఆశ్రయించాక ఇక ప్రజాహిత వ్యాజ్యం ఎందుకని సీజే ప్రశ్నించారు. దర్యాప్తు తీరుపై నేడు నివేదిక అందించాలని ఏజీని ఆదేశించారు. దర్యాప్తు నివేదికను విశాఖ నుంచి తేవాలని.. సోమవారం లేదా మంగళవారం కోర్టుకు అందచేస్తామని ఆయన బదులిచ్చారు.