ఫేక్‌ న్యూస్‌ దెబ్బకు రూ.500 కోట్ల నష్టం

ఫేక్‌ న్యూస్‌ దెబ్బకు  రూ.500 కోట్ల నష్టం

యూట్యూబ్ లో తమ సంస్థపై తప్పుడు వార్తలు పెట్టడంతో రూ.500 కోట్లు నష్టపోయామంటూ ప్రముఖ ఆభరణాల సంస్థ కళ్యాణ్ జువెలర్స్ కేరళ హైకోర్టును ఆశ్రయించింది. నకిలీ బంగారం అమ్ముతున్నామని తమ సంస్థపై దుష్ప్రచారానికి పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కళ్యాణ్ జువెలర్స్ కోర్టును కోరింది. నకిలీ బంగారు నగలు అమ్ముతున్నామన్న తప్పుడు ప్రచారంతో ఇప్పటికే రూ.500 కోట్ల మేర నష్టం వాటిల్లందంటూ పిటిషన్ లో పేర్కొంది. తమ కువైట్ నగల దుకాణంలో జరిగిన సాధారణ తనిఖీలకు సంబంధించిన వీడియోలను అవినీతి నిరోధక దాడులుగా చిత్రీకరించి, తమ బ్రాండ్ విలువను దెబ్బతీసేలా ప్రచారం చేస్తున్నారని తెలిపింది. తమ ప్రత్యర్థి కంపెనీలే ఈ దుష్ప్రచారానికి పాల్పడుతున్నాయని చెప్పింది. నకిలీ వీడియోలను అప్ లోడ్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన కేరళ హైకోర్టు, సోషల్ మీడియాలో నకిలీ వార్తలను అదుపు చేసేందుకు చర్యలు చేపట్టాల్సిందిగా ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.