విషమంగా కనికా కపూర్ ఆరోగ్యం !

విషమంగా కనికా కపూర్ ఆరోగ్యం !

 బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ కు వరుసగా నాలుగోసారి కరోనా పాజిటివ్ అని పరీక్షల్లో తేలింది. దీంతో ఆమె కుటుంబసభ్యులు.. తీవ్ర ఆందోళనల్లో మునిగిపోయారు.కరోనా పాజిటివ్ కారణంగా ఆమె మార్చి 20 న ఆసుపత్రిలో చేరింది. ప్రస్తుతం ఆమె సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ లో చికిత్స పొందుతోంది.

కనికా కపూర్ ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు ఆమె కుటుంబసభ్యులు చెబుతున్నారు. వైద్యుల చికిత్సకు ఆమె స్పందించడం లేదంటున్నారు. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ఉండడంతో...  మెరుగైన చికిత్స కోసం ఆమెను విమానాల్లో కూడా తరలించడానికి కూడా సాధ్యం కావడం లేదని వాపోతున్నారు. దేవుడిపైన భారం వేసి, ప్రార్థించడం తప్ప, మరో మార్గం కనిపించడం లేదంటున్నారు ఆమె కుటుంబసభ్యులు.  అయితే ఆమెకు చికిత్స చేస్తున్న వైద్యులు మాత్రం, కనికా  ఆరోగ్యం నిలకడగానే ఉందంటున్నారు.

లండన్ నుంచి స్వదేశానికి తిరిగొచ్చిన తర్వాత కనికా కపూర్.. లక్నోతో పాటు మరో రెండు ప్రదేశాల్లో జరిగిన పార్టీలకు హాజరయ్యారు. తర్వాత పరీక్షలు చేయించుకోగా, ఆమెకు కరోనా ఉన్నట్లు తేలింది. ఈమె ఇచ్చిన పార్టీకి రాజకీయ ప్రముఖులతో పాటు వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు హాజరయ్యారు. కనికాకు పాజిటివ్ తేలడంతో..  రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే సింధియా, ఆమె కుమారుడు దుష్యంత్ సింగ్, యూపీ ఆరోగ్య మంత్రితో పాటు మరికొందరు కూడా స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు.