అందుకోసమైనా 17 ఎంపీలు గెలవాలి: హరీశ్ రావు

అందుకోసమైనా 17 ఎంపీలు గెలవాలి: హరీశ్ రావు

కేంద్రంలో‌ మన బలం ఉంటే మన సమస్యలు పరిష్కారం చేసుకోవచ్చు.. అందుకే 17‌ఎంపీలు తెరాసనే గెలవాలని మంత్రి హరీశ్ రావు అన్నారు. నేడు ఆయన టీఎన్జీవోల డైరీ ఆవిష్కరణ సభలో మాట్లాడుతూ... టీఎన్జీవోలకు, తెలంగాణ ఉద్యమానికి అవినాభావ సంబంధం ఉంది. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు తెలంగాణ పదాన్ని నిషేదిస్తే.. తెలంగాణ ఎన్జీవోలుగా పేరు పెట్టుకున్నారు. ఉద్యమంలో‌‌‌ టీఎన్జీవోల పాత్ర చారిత్రాత్మకం అని పేర్కొన్నారు. ఆర్టీఏ కార్యాలయానికి లగడపాటి వస్తే.. ఉద్యోగులకు అండగా నిలబడ్డాం. ఆ సమయంలో స్వామిగౌడ్ గారిపై దాడి జరిగిందని హరీశ్ రావు గుర్తు  చేశారు.

ఉద్యమంలో ఉద్యోగులు పోలీస్ స్టేషనులో ఉండేందుకు సిద్దపడ్డారు. తెలంగాణ ఉద్యోగుల సమస్యలు సీఎం కేసీఆర్ పరిష్కరిస్తారని హరీశ్ రావు హామీ ఇచ్చారు. చంద్రబాబు ఉద్యోగుల విభజన, ప్రభుత్వ రంగ సంస్థలు, హైకోర్ట్ విభజన అడ్డుకున్నారు. అందుకే ఉద్యోగుల విషయంలోను సమస్యలు తలెత్తాయి. కేంద్రంలో‌ మన బలం ఉంటే మన సమస్యలు పరిష్కారం చేసుకోవచ్చు. అందుకే 17‌ఎంపీలు తెరాసనే గెలవాలన్నారు. అసాధ్యమైన అభివృద్ధి కార్యక్రమాలను సీఎం కేసీఆర్ రాష్ట్రంలో చేపట్టారు. ఆయన దార్శనికత రాష్ట్రానికి, దేశానికి అవసరమన్నారు. సీఎం కేసీఆర్ పథకాలను అద్బుతంగా ప్రజల్లోకి తీసుకెళ్లిన ఘనత ఉద్యోగులదే. ఉద్యోగులతో కలిసి తెలంగాణ సాధించాం, ఉద్యోగులతో కలిసి రాష్ట్రం అభివృద్ది దిశగా నడుస్తోందని హరీశ్ రావు అన్నారు.