25వరకు కొత్త ఓటర్ నమోదు ప్రక్రియ

25వరకు కొత్త ఓటర్ నమోదు ప్రక్రియ

మొన్నటి ఎన్నికల్లో ఓటర్ల జాబితా విషయంలో ఎక్కువ ఆరోపణలు వచ్చాయని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్ తెలిపారు. ఇప్పటి వరకు 9,54,827 అభ్యంతరాలు,ఫిర్యాదులు వచ్చాయని వివరించారు. ఈనెల 25 వరకు అభ్యంతరాలు, ఫిర్యాదులు తీసుకుంటామన్నారు. ఈ ఏడాది ఓట్ల నమోదు కోసం కొత్తగా 8 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయని ఆయన తెలిపారు. ఓటర్ల నమోదు అనేది ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు నడుస్తుందన్నారు. ఓటు తొలగింపు కోసం 10వేల దరఖాస్తులు వచ్చాయన్న రజత్ కుమార్, జనవరి 25 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పారు.  ఫిబ్రవరి 25న తుది ఓటరు జాబితా ప్రచురిస్తామన్నారాయన. తుది ఓటరు జాబితా ముద్రణ తర్వాత ఓట్ల తొలగింపు, డబుల్ ఓట్లు కూడా తొలగించడం కుదరదని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి స్పష్టం చేశారు.  హైదరాబాద్ పరిధిలో 6 లక్షల ఓట్ల తొలగింపు జరిగిందని, ఎన్నికలకు ముందు ఓటరు జాబితాలో పేరు సరిచూసుకోవడం కూడా పౌరుల బాధ్యతేనని రజత్‌కుమార్ తేల్చి చెప్పారు.