మోడీ నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేశారు...

మోడీ నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేశారు...

రైతు పండించిన పంటకు మద్దతు ధర, రైతుల సమస్యల పరిష్కారానికి రెవారిలో పాదయాత్ర నిర్వహించిన స్వరాజ్‌ అభియాన్‌ అధ్యక్షుడు, జై కిసాన్‌ ఆందోళన్‌ వ్యవస్ధాపకుడు యోగేంద్ర యాదవ్‌ను ఆదాయపన్నుశాఖ టార్గెట్ చేసింది. యోగేంద్ర యాదవ్‌ పాదయాత్ర ముగిసిన రెండు రోజుల తర్వాత ఆయన చెల్లెళ్లు నిర్వహిస్తున్న ఆస్పత్రిపై ఐటీ దాడులు జరిగాయని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ తనను, తన కుటుంబాన్ని టార్గెట్‌ చేస్తున్నారని... అందుకే రెవారిలో తన సోదరి నిర్వహిస్తోన్న నర్సింగ్‌ హోంపై ఢిల్లీ నుంచి వచ్చిన వంద మం‍దికి పైగా అధికారుల బృందం దాడులకు పాల్పడిందని ఆయన సోషల్ మీడియాలో పేర్కొన్నారు. నరేంద్ర మోడీ సర్కార్ తమ కుటుంబాన్ని టార్గెట్‌ చేసిందని ఆరోపించారు. తన చెల్లెళ్లు, బావ, మేనల్లుడి చాంబర్లను స్వాధీనం చేసుకుని ఆస్పత్రిని సీల్‌ చేశాయని ఆందోళన వ్యక్తం చేసిన ఆయన... ఐసీయూలో శిశువులున్నా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అణిచివేత వైఖరితో మోడీ తన నోరు మూయించలేరని ట్వీట్‌ చేశారు యాదవ్. కాగా, మద్దతు ధర, రైతు సమస్యల పరిష్కారం కోసం ఆయన తొమ్మిది రోజుల పాటు పాదయాత్ర నిర్వహించారు. తొమ్మిది రోజుల్లో 127 గ్రామాల మీదుగా 250 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగింది. రైతు పండించిన పంటకు మద్దతు ధర ఇవ్వాల్సిందేనని ఉద్యమాన్ని ప్రకటించిన యోగేంద్ర యాదవ్‌... ప్రతీ గ్రామంలో మద్యం షాపులను మూసివేయాలని కూడా డిమాండ్ చేశారు.