ఆత్మనిర్బర్‌ ప్యాకేజీ... క్రూరమైన జోక్‌..!

ఆత్మనిర్బర్‌ ప్యాకేజీ... క్రూరమైన జోక్‌..!

కరోనా లాక్‌డౌన్‌తో దెబ్బతిన్న ఆర్థికవ్యవస్థను గాడిలో పెడతామంటూ రూ.20 లక్షలతో కోట్లతో భారీ ప్యాకేజీ ప్రకటించారు ప్రధాని నరేంద్ర మోడీ.. ఇక, ప్రధాని మోడీ ప్రకటించిన ఆత్మనిర్బర్‌ ప్యాకేజీ వివరాలు ఐదురోజుల పాటు వివరించారు ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌.. అయితే.. ఆ ప్యాకేజీ వివరాలను ఐదు రోజులపాటు వివరించడాన్ని క్రూరమైన జోక్‌గా కాంగ్రెస్ ఆరోపించింది. కేంద్రం ఓ వ్యూహం లేకుండా లాక్ డౌన్ విధించిందని మండిపడింది. 21 రోజుల్లో వైరస్‌తో యుద్ధం ముగుస్తుందని, ప్రారంభదశలో ప్రధాని వేసిన అంచనా నిజం కాలేదన్నారు. మోడీ సర్కార్... దేశ రాజ్యాంగంలో భాగమైన ఫెడరలిజాన్ని మర్చిపోయిందన్నారు. అధికారం ఇప్పుడు ప్రధాని కార్యాలయంలో కేంద్రీకృతమైందని ఎద్దేవా చేశారు. విపక్ష పార్టీల సమావేశంలో సోనియా .. కేంద్రంపై నిప్పులు చెరిగారు. వలస కార్మికులను పూర్తిగా ప్రభుత్వం విస్మరించిందని మండిపడ్డారు సోనియాగాంధీ.. అట్టడుగున ఉన్న సుమారు 13 కోట్ల కుటుంబాలకు ప్రభుత్వం కనీసం ఎలాంటి ఆర్థిక సాయం చేయలేదన్నారు. కరోనా వైరస్‌ పరిస్థితిపై పార్లమెంట్‌లో గానీ, స్టాండింగ్‌ కమిటీతో గానీ చర్చించలేదని విమర్శించారు.