ఏడు బ్యాంకులకు ఆర్బీఐ జరిమానా

ఏడు బ్యాంకులకు ఆర్బీఐ జరిమానా

వివిధ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఏడు బ్యాంకులకు ఆర్బీఐ జరిమానా విధించింది. నో యువర్ కస్టమర్ (కెవైసి) నిబంధనలు, యాంటీ మనీ లాండరింగ్ (ఏఎంఎల్) ప్రమాణాలపై ఆర్బీఐ జారీ చేసిన పలు సూచనలను పాటించనందుకు హెచ్ డిఎఫ్ సి బ్యాంక్, కోటక్ మహింద్ర బ్యాంక్, ఐడిబిఐ బ్యాంకులకు రూ. 20 లక్షలు జరిమానా వేసింది. 

ఈ చర్య కేవలం క్రమబద్ధీకరణను పాటించడంలో జరిగిన లోపాలపై తీసుకున్నట్టు ఆర్బీఐ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. ఖాతాదారులతో బ్యాంకుల ఎలాంటి లావాదేవీని కానీ, ఒప్పందాల విశ్వసనీయతను దెబ్బతీసేందుకు ఉద్దేశించినది కాదని తెలిపింది. 

కేంద్ర బ్యాంక్ మరో నాలుగు బ్యాంకులకు కూడా జరిమానాలు వడ్డించింది. నిధుల అంతిమ వినియోగంపై పర్యవేక్షణ, ఇతర బ్యాంకులతో సమాచార వినిమయం, మోసాల వర్గీకరణ, వివరణ, ఖాతాల పునర్నిర్మాణంపై ఆర్బీఐ జారీ చేసిన పలు సూచనలు పాటించనందుకు అలహాబాద్ బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలకు జరిమానాలు విధించింది. ఆంధ్రాబ్యాంక్ కి రూ.1 కోటి, ఇతర బ్యాంకులకు తలా రూ.1.5 కోట్లు జరిమానా పడింది.