ఏపీలో పించన్లు డబుల్... సంక్రాంతి నుంచే అమలు

ఏపీలో పించన్లు డబుల్...  సంక్రాంతి నుంచే అమలు


ఏపీ సీఎం చంద్రబాబు సంక్రాంతి కానుకను ప్రకటించారు. ఫించన్ మొత్తాలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఉన్న వెయ్యి రూపాయల ఫించన్ ను రూ.2 వేలకు పెంచారు. నెల్లూరు జిల్లా బోగోలులో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ఈ ప్రకటన చేశారు.  రాష్ట్రంలోని ప్రజలకు ఇదే తన సంక్రాంతి కానుక అని సీఎం తెలిపారు. పాత, కొత్త పింఛన్లు కలిపి ఫిబ్రవరి నెలలో రూ.3వేలు అందిస్తామన్నారు. మార్చి నుంచి అంతా రూ.2వేలు పింఛను తీసుకుంటారని స్పష్టం చేశారు. తాము అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలోని వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులెవరూ అధైర్యపడొద్దని అప్పట్లో రూ.200గా ఉన్న పింఛనును రూ.1000కి పెంచామన్నారు. దాన్ని మరోసారి రెట్టింపు చేస్తూ జనవరి నుంచి నెలనెలా రూ.2వేలు చొప్పున ఇవ్వనున్నట్టు ప్రకటించారు. 

ఇంటికి పెద్ద కొడుకుగా ఉంటానని భరోసా ఇచ్చానని చంద్రబాబు గుర్తు చేశారు. ఉద్యోగులకు ఎలాగైతే జీతాలు వస్తాయో.. అదే తరహాలో పింఛన్లు అందించిన ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు. ఎంత ఖర్చయినా పర్వాలేదని, పేదల సంక్షేమమే తనకు ముఖ్యమని చెప్పారు. వృద్ధులు, వితంతువులు మందులు కొనుక్కొనేందుకు సైతం ఇబ్బందులు పడుతున్నారని అలాంటి వారి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొనే పింఛన్లు పెంచామని సీఎం తెలిపారు.  ప్రతినెలా ఇచ్చే పింఛను సొమ్ము రెట్టింపు కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా 54లక్షల మంది పింఛనుదారులకు లబ్ధి చేకూరనుంది. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, గీత కార్మికులకు లబ్ది చేకూరనుంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం రోజే నెలకు రూ.1000కి పెంచారు.