స్టాక్ మార్కెట్లలో ఒడిదుడుకులు...రంగంలోకి సెబీ!

 స్టాక్ మార్కెట్లలో ఒడిదుడుకులు...రంగంలోకి సెబీ!

గతవారం భారత స్టాక్ మార్కెట్లలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో....సెబీ రంగంలోకి దిగింది. నివారణ మార్గాలను అన్వేషించడం, అవసరమైన చర్యలు తీసుకోవడం కోసం సిద్ధంగా ఉన్నట్లు సెబీ ప్రకటించింది. మార్కెట్లలో తీవ్రమైన ఒడిదుడుకులు ఏర్పడినప్పుడు, ఆర్థిక వ్యవస్థపై పెద్దగా ప్రభావం లేకుండా తీసుకోవాల్సిన అన్ని చర్యలకూ సిద్ధమేనని సెబీ తెలిపింది. రిస్క్ మేనేజ్‌మెంట్ తీరుతెన్నులను సిద్ధం చేసే పనిలో పడింది. గత వారం కరోనా వైరస్ కారణంగా తీవ్రంగా నష్టపోతున్న రంగాలకు చెందిన షేర్లను అమ్మడానికి ఇన్వెస్టర్లు పరుగులు తీశారు. దీంతో స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను ఎదుర్కొన్నాయి.

ఆ వెంటనే తక్కువ ధరలకు షేర్లను కొనే అవకాశం దక్కుతుందనే ఉద్దేశ్యంతో తిరిగి కొనుగోళ్లపై పెట్టుబడిదారులు ఆసక్తి చూపించారు. దీంతో మార్కెట్లు వెంటనే లాభాల్లోకి వెళ్లాయి. ఇలాంటి స్థితి మార్కెట్లకు మంచిది కాదని అభిప్రాయపడ్డ సెబీ రంగంలోకి దిగింది. సెబీ చర్యలతో మార్కెట్లు కోలుకుంటాయని ఇన్వెస్టర్లు అభిప్రాయపడుతున్నారు. కరోనా ప్రభావంతో ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లు నష్టాల్లోకి వెళ్లడంతో...సహజంగానే ఆ ప్రభావం భారత్‌పై పడింది. అయితే 15 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా భారత మార్కెట్లు దాదాపు 20 శాతం నష్టాలను ఎదుర్కున్నాయి. కరోనాతో తొలుత ఎఫెక్ట్ అయిన చైనా మార్కెట్ల కంటే ఇతర ఆసియా దేశాల మార్కెట్లు భారీగా నష్టపోయాయి. చైనాలో స్టాక్ మార్కెట్లు 1.78 శాతం నష్టపోగా....ఆసియా మార్కెట్లు 7నుంచి 15 శాతం నష్టపోయాయి. ఒక రకంగా చెప్పాలంటే, కరోనా ప్రభావం చైనా మార్కెట్ల కంటే, అక్కడి నుంచి వ్యాప్తి చెందన దేశాల్లో ఎక్కువగా కనిపిస్తున్నది.