'నా ప్రశ్నలకు సమాధానం చెప్తే రాజకీయాలు వదిలేస్తా'

'నా ప్రశ్నలకు సమాధానం చెప్తే రాజకీయాలు వదిలేస్తా'

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చంద్రబాబు నా ప్రశ్నలకు సమాధానం చెప్తే రాజకీయాలు వదిలేస్తా అని తెలంగాణ టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు సవాల్ విసిరారు. చంద్రబాబు వైఖరిని తప్పుబడుతూ ధర్మపోరాటం పేరుతో మోత్కుపల్లి తిరుపతిలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్, జగ్జీవన్ రాం, పూలే, ఎన్టీఆర్ విగ్రహాలకు నివాళులు  అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... నేను ఒక పేద దళితున్ని, అంబేడ్కర్ వారసుడిని, ఎన్టీఆర్ శిస్సుడినని అన్నారు. తనకు రాజకీయ భిక్ష పెట్టింది చంద్రబాబు కాదు ఎన్టీఆర్ అని తెలిపారు. చంద్రబాబుది అధర్మపోరాటమని మోత్కుపల్లి విమర్శించారు. ఎన్టీఆర్ ను చంపిన వ్యక్తి చంద్రబాబు అని పేర్కొన్నారు. చంద్రబాబును ఎవ్వరూ పట్టించుకోనపుడు నేను పక్కన ఉన్న.. ఇపుడు నన్ను నడి బజారులో వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అలా సింగపూర్ వెళ్ళాడో లేదో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసాయి అని మోత్కుపల్లి ఎద్దేవా చేశారు. 

చంద్రబాబు ఒక్కో రాజ్యసభ సీటును రూ.వంద కోట్లకు అమ్ముకున్నడని అని మోత్కుపల్లి ఆరోపించారు. తానేం తప్పు చేశానని.. తనకు అన్యాయం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. నేను అడిగే ప్రశ్నలకు చంద్రబాబుకు సమాధానం చెప్పే దమ్ము ఉందా.. తన ప్రశ్నలకు సమాధానం చెప్తే రాజకీయాలు వదిలేస్తానని మోత్కుపల్లి నర్సింహులు సవాల్ విసిరారు. ఎన్టీఆర్ ను చంపినట్లు తెలంగాణ సీఎంను కూడా చంపాలని బాబు ప్లాన్ వేశాడని పేర్కొన్నాడు. చంద్రబాబుకు పిచ్చి పట్టింది.. లోకేష్ తప్ప ఇంకా ఎవరిని బాబు గుర్తు పట్టడం లేదన్నారు. ప్రజల మనిషి ముద్దకృష్ణమ నాయుడుని కూడా చంద్రబాబు వంచించటం వల్లే చనిపోయాడని ఆయన పేర్కొన్నాడు. రాజకీయాలు చేయడానికి తిరుపతికి రాలేదు... చంద్రబాబు పాపాలను దేవునికి వివరించడానికి తిరుపతి వచ్చాను అని మోత్కుపల్లి తెలిపారు. పోలీసులు, రౌడీలతో నన్ను  చంపాలని చంద్రబాబు చూస్తున్నాడని తెలిపాడు.