ఆర్బీకి స్పందించని నిఫ్టి
ఆర్బీఐ ప్రకటించిన పరపతి విధానానికి మార్కెట్ పెద్దగా స్పందించలేదు. ఒక్క ఆటోమొబైల్ రంగ షేర్లు మినహా ఇతర షేర్లేవీ స్పందించలేదు. ఆర్బీఐ రేట్ల తగ్గింపు నిర్ణయంతో గృహ నిర్మాణ రుణాలపై వడ్డీ రేట్లు తగ్గుతాయని వార్తలు వస్తున్నా రియల్ ఎస్టేట్ షేర్ల సూచీ నష్టాల్లోనే ముగిసింది. జీ ఎంటర్టైన్మెంట్ షేర్ కారణంగా మీడియా రంగ సూచీ, ఫార్మా మినహా మిగిలిన సూచీల్లో పెద్దగా కదలికలు లేవు. ఆర్బీఐ పరపతి విధానం తరువాత మార్కెట్ కాస్త గ్రీన్లోఉన్నా... మిడ్ సెషన్లో ప్రారంభమైన యూరో మార్కెట్లు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. ప్రధాన సూచీలు ఒక శాతం దాకా నష్టపోవడంతో ఇన్వెస్టర్లు జాగ్రత్త పడుతున్నారు. రోజుకో స్కామ్ అన్నట్లు ఇపుడు ప్రధాన బ్లూచిప్ కంపెనీలపై కూడా ఆరోపణలు వస్తుండటంతో సాధారణ ఇన్వెస్టర్లు ప్రస్తుత స్థాయిలో కొనుగోళ్ళకు జంకుతున్నారు. దీంతో నిఫ్టి కేవలం 7 పాయింట్ల లాభంతో 11,069 వద్ద క్లోజ్ కాగా, సెన్సెక్స్ 4 పాయింట్ల నష్టంతో ముగిసింది. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ కంపెనీల్లో అమ్మకాల హోరు ఏమాత్రం తగ్గలేదు. నిఫ్టిలో 30 షేర్లు లాభాల్లో ముగిశాయి. నిఫ్టి ప్రధాన షేర్లలో జీ ఎంటర్టైన్మెంట్, సన్ ఫార్మా షేర్లు నాలుగు శాతంపైగా లాభపడ్డాయి. ఐషర్ మోటార్స్ ఇవాళ మరో మూడున్నర శాతం పెరిగింది. బజాజ్ ఆటో, గ్రాసిం షేర్లు మూడు శాతం చొప్పున లాభంతో ముగిశాయి. ఇక నష్టాల్లో ముగిసిన నిఫ్టి షేర్లలో జేఎస్డబ్ల్యూ స్టీల్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎల్ అండ్ టీ, పవర్ గ్రిడ్, హెచ్డీఎఫ్సీ ఉన్నాయి. ఇక ఇతర షేర్లలో అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇన్ఫ్రా 30 శాతం క్షీణించగా, ఆర్ పవర్ 22 శాతం తగ్గింది. రిలయన్స్ క్యాపిటల్ కూడా 19 శాతం క్షీణించింది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)