బయ్యారంపై గవర్నర్ ను కలిసిన అన్ని పార్టీలు 

బయ్యారంపై గవర్నర్ ను కలిసిన అన్ని పార్టీలు 

బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుపై ఈరోజు అన్ని పార్టీల నేతలు గవర్నర్ ను కలిశారు. ఈ సందర్భంగా రాజ్ భవన్ లో సీపీఐ నేత చాడా వెంకట్ రెడ్డి మాట్లాడుతూ... గవర్నర్ గారికి ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుపై అన్ని వివరాలు చెప్పామని తెలిపారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీతో పాటు విభజన హామీలు అమలు కావటం లేదని ఆయన అన్నారు. ఖాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్శిటీ, జాతీయ ప్రాజెక్టు వంటి హామీలు అమలుకావటం లేదని వెల్లడించారు. లక్షా 54వేల ఎకరాల్లో ఖనిజం ఉందని... దీంతో పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తాయని వివరించారు. అందుకే విభజన హామీ అయిన.. ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయక పోవటం.. తెలంగాణ ప్రజలను మోసం చేయడమేనని ఆయన తెలిపారు. ఉక్కు ఫ్యాక్టరీని వెంటనే 34వేల కోట్లతో ప్రభుత్వ రంగంలోనే ఏర్పాటు చేయాలని. అందుకోసం టీబీజేపీ.. టీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి పెంచాలని చాడా వెంకట్ రెడ్డి తెలిపారు. 

ఎల్ రమణ
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బయ్యారం ఉకు ఫ్యాక్టరీ ఏర్పాటుపై ప్రణాళికతో ముందుకు రావాలని తెతెదేపా నేత ఎల్. రమణ అన్నారు. ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుతో గిరిజనుల బతుకుల్లో వెలుగులు నిండుతాయని వివరించారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయకపోతే అన్ని పక్షాలు ఏకమై తెలంగాణ ఉద్యమంలా మరో ఉద్యమం చేపడతామని ఎల్.రమణ తెలిపారు.  

కోదండరాం
అక్రమ మైనింగ్ ను అరికట్టి, ప్రభుత్వ రంగంలోనే బయ్యారం ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలని  తెలంగాణ జన సమితి (టీజేఎస్) నేత కోదండరాం డిమాండ్ చేశారు. అప్పుడే గిరిజనులకు న్యాయం జరుగుతుందని.. పర్యావరణానికి మేలని కోదండరాం వివరించారు.  

పొంగులేటి  కాంగ్రెస్
2014 పునర్విభజన చట్టాన్ని అమలు పరిచేలా చూడాలని గవర్నర్ ను కోరినట్లు తెలిపారు తెలంగాణ కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. విభజన హామీలు అమలు కాకపోయినా కూడా సీఎం ఒక్క మాట మాట్లాడటం లేదని పొంగులేటి తెలిపారు. ఈ విషయంలో ఎందుకు మీరు మౌనం వహిస్తున్నారు, మోడీకి బయపడుతున్నారా? అంటూ ఆయన ప్రశ్నించారు. విభజన హామీల కోసం ప్రక్క రాష్ట్రంలో అధికార పక్షం, ప్రతిపక్షం పోరాడుతున్నాయని ఆయన వివరించారు. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే 15వేల ఉద్యోగాలు వస్తాయని... అన్ని పక్షాలను కలుపుకొని ప్రజాస్వామ్య బద్దంగా అమలయ్యేలా చూడాలని ఆయన డిమాండ్ చేశారు.