స్వామిజీపై వేటు ఎత్తి వేయాలి: రామరాజు

స్వామిజీపై వేటు ఎత్తి వేయాలి: రామరాజు

శ్రీపీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి నగర బహిష్కరణను ఎత్తి వేయాలి అని విహెచ్ పి రాష్ట్ర అధ్యక్షుడు రామరాజు డిమాండ్ చేశారు. ఇవాళ రామరాజు మాట్లాడుతూ... తెలంగాణలో నేరస్తులకు స్వామిజీలకు తేడా లేకుండా పోయిందన్నారు. హిందువులను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన వారిని వదిలి సమాజానికి  మంచి సందేశం ఇచ్చేవాళ్ళను నగర బహిష్కరణ చేయడం ఎంత వరకు సమంజసం అని ఆయన ప్రశ్నించారు. దేవుడిని దర్శనం చేసుకుంటా అంటే తప్పా? అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వామిజీపై వేసిన వేటు హిందు సమాజన్ని ఈ ప్రభుత్వం అవమానించినట్లే అని ఆయన పేర్కొన్నారు. ఔరంగబాద్, నిజాం నవాబు గురించి మాట్లాడితే నేరస్తుడిగా చూస్తారా అని అన్నారు. బేషరతుగా స్వామిజీపై వేటు ఎత్తి వేయాలి అని రామరాజు డిమాండ్ చేశారు.

స్వామిజీపై వేటు ఎత్తివేయకుంటే మా ఆందోళనలు ఉదృతం చేస్తాం.. ఆంధ్ర, తెలంగాణలో ఆందోళనలు చేస్తాం అని రామరాజు తెలిపారు. ప్రభుత్వం దిగివచ్చే వరకు పోరాటం ఆగదన్నారు. మంచి చెప్పే వారిని అనగదొక్కుతారా.. ఇదేం ప్రభుత్వం అని ఎద్దేవా చేశారు. హిందువులందరు గమనిస్తూనే వున్నారు.. తిరుగుబాటు తప్పదన్నారు. స్వామిజీ యాత్ర చేస్తే ఆయన వెంట వచ్చేది భక్తులే కానీ సంఘ వ్యతిరేక శక్తులు కాదు అని రామరాజు పేర్కొన్నారు.

మరో వైపు పరిపూర్ణానంద స్వామి నగర బహిష్కరణను నిరసిస్తూ ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ, ఏబీవీపీ నేతలు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. తెలంగాణ సీఎం కేసిఆర్ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఈ నేపథ్యంలో ఎలాంటి ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. పరిపూర్ణానంద స్వామిని హైదరాబాద్ పోలీసులు నగర బహిష్కరణ చేసిన విషయం తెలిసిందే. జూబ్లీహిల్స్‌లో గృహనిర్బంధంలో ఉన్న ఆయనను అదుపులోకి తీసుకుని ఇంటి నుంచి తరలించారు. అయితే ఆయనను ఎక్కడికి తరలించారనే సమాచారం మాత్రం లేదు. గత ఏడాది నవంబర్‌లో రాష్ట్రీయ హిందూసేన సమావేశంలో పరిపూర్ణానంద స్వామి చేసిన ప్రసంగంపై వచ్చిన ఫిర్యాదుల మేరకే ఆయనను నగర బహిష్కరణ చేశారని సమాచారం.