మహారాష్ట్రకు చేరిన మిడతల దండు..తెలంగాణకు ముప్పు!

 మహారాష్ట్రకు చేరిన మిడతల దండు..తెలంగాణకు ముప్పు!

ఓ వైపు కరోనా మహమ్మారి కారణంగా దేశం అతలా కుతలం అవుతుంటే మరో వైపు మిడతల దండు ఆందోళన కలిగిస్తోంది. పంట పొలాలపై దాడి చేస్తున్న మిడతలు ధాన్యాన్ని పంటను నాశనం చేస్తూ రైతులకు నష్టం కలిగిస్తున్నాయి. ఇక ఇప్పుడు మహారాష్ట్ర నుండి మిడతల దండు తెలంగాణకు చేరుకునే అవకాశం ఉందని  రాష్ట్ర వ్యవసాయశాఖ అప్రమత్తమైంది. ఈ నేపత్యంలో మంగళవారం రాత్రి వ్యవసాయశాఖ కార్యదర్శి బి. జనార్దన్‌రెడ్డి ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...మహారాష్ట్రలోని అమరావతి ప్రాంతంలో మిడతల దండును నియంత్రిస్తున్నట్లు అక్కడి అధికారులు తెలిపారని అన్నారు .  ఒకవేళ అక్కడ ముడతలను కంట్రోల్‌ చేయకపోతే తెలంగాణకు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర సరిహద్దు జిల్లాలైన ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, కామారెడ్డి, భూపాలపల్లి, నిర్మల్‌లలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆయా జిల్లాల కలెక్టర్లు జిల్లాస్థాయి కమిటీలను ఏర్పాటు చేసి సంబంధిత అధికారులతో సమన్వయ సమావేశాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. మిడతల దండు గంటకు 12-15 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుందని, ఇవి చెట్ల మీద ఆవాసం ఏర్పరుచుకొని పంటలకు భారీ నష్టం కలిగిస్తాయన్నారు. మిడతల దండును సామూహికంగా నివారించే విషయంపై రైతులను చైతన్యం చేయాలన్నారు. మిడతల దండు ఉత్తర ఆఫ్రికా దేశాల నుంచి పాకిస్తాన్‌ మీదుగా రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలకు విస్తరించిందని అన్నారు వాటిలో సంతోత్పత్తి ఎక్కువగా ఉంటుందని ఒక్కో మిడత దాని బరువుకు సమానమైన ఆహరం తింటుందని అన్నారు,