పోలవరం ఆలస్యానికి అసలు కారణం ఇదే...

పోలవరం ఆలస్యానికి అసలు కారణం ఇదే...

అంచనాలు పెరగడం వల్లే పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు ఆలస్యం అయ్యిందన్నారు కేంద్ర జలవనరులశాఖ మంత్రి నితిన్ గడ్కరీ... ఏపీ సీఎం చంద్రబాబుతో కలిసి పోలవరం డ్యామ్ సైట్‌ను పరిశీలించిన ఆయన పనులు జరుగుతున్న తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. మా శాఖ అధికారులతో ఎప్పటికప్పుడు పోలవరం ప్రాజెక్ట్ పనులపై సమీక్ష నిర్వహిస్తున్నానని తెలిపిన గడ్కరీ... నిన్న కూడా ఏపీ ఇరిగేషన్ అధికారులతో చర్చించినట్టు వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం నిర్మాణం కోసం ముందుగా నిధులు విడుదల చేయమని కోరారని... కానీ, దీనిపై ఆర్థిక మంత్రితో చర్చించాల్సి ఉందన్న గడ్కరీ... ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయం గతం కంటే చాలా పెరిగిందని... సవరించిన అంచనాలను ఇంకా ఆమోదించాల్సి ఉందన్నారు. అలాగే, ప్రధానంగా నిర్వాసితులకు పరిహారం ఇవ్వాల్సి ఉందన్న కేంద్రమంత్రి... పరిహార వ్యయం రెండింతలు పెరిగిందని తెలిపారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉందని స్పష్టం చేశారు. 

పోలవరం ప్రాజెక్ట్ ను తాము రాజకీయంగా చూడడంలేదని స్పస్టం చేశారు గడ్కరీ... టెక్నీకల్ ప్రాబ్లమ్స్ వల్లే ప్రాజెక్టు ఆలస్యం అవుతోందన్న ఆయన... ఇందులో రాజకీయాలు చూడొద్దని విజ్ఞప్తి చేశారు. ఎలాగైనా పోలవరంను పూర్తి చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ, నేను చూస్తున్నామన్న గడ్కరీ... ఆంధ్రప్రదేశ్ కు ఈ ప్రాజెక్ట్ ఎంతో ఉపయోగకరమైనదో తమకు తెలుసన్నారు. 8 రోజుల్లో ప్రాజెక్ట్ వివరాలు అన్నీ నా వద్దకు పంపించాలని అధికారులకు సూచించిన కేంద్ర మంత్రి... ప్రత్యేకంగా 3 రోజులు ప్రాజెక్ట్ కోసం కేటాయిస్తానని తెలిపారు. కేంద్ర ఆర్ధికమంత్రితో దీనిపై చర్చిస్తానని వెల్లడించిన ఆయన... పోలవరం ప్రాజెక్ట్ పనులు చాలా మంచిగా జరుగుతున్నాయని... ప్రాజెక్ట్ ను ఇలా చూడడం ఆనందంగా ఉందన్నారు. ఇది జాతీయ ప్రాజెక్ట్, మా బాధ్యత పూర్తిగా ఉందన్న గడ్కరీ... ఖచ్చితంగా ప్రాజెక్ట్ పూర్తిచేసి తీరుతామని ప్రకటించారు. నేను హామీ ఇచ్చాక వెనక్కు తగ్గింది లేదు, మాట ఇచ్చాక చేసి తీరుతామని స్పష్టం చేశారు.