కరోనా లాక్ డౌన్ అంటే...అమెరికాలో గన్స్ కోసం ఎగబడుతున్నారు !

కరోనా లాక్ డౌన్ అంటే...అమెరికాలో గన్స్ కోసం ఎగబడుతున్నారు !

కరోనాతో ఇళ్లల్లోనే ఉండిపోవాల్సి రావడంతో ఫ్రాన్స్‌ ప్రజలు అత్యవసరం అనుకుంటున్నవి ఏమిటో తెలుసా? పేస్ట్రీలు, వైన్‌.  ఇక అమెరికాలో అయితే  గోల్ఫ్‌, గన్స్‌ లేకుండా ఉండలేకపోతున్నారు.  లాక్‌డౌన్‌ ఫలితంగా ఇళ్లల్లో ఉంటున్నవారు ఏది అత్యవసరం  అనుకుంటున్నారో ఆరా తీయగా.. వారు చెప్పిన ఈ విషయాలను విని ఆశ్చర్యపోవక తప్పదు. తాగడానికి నీళ్లు, తినడానికి తిండి గురించి అమెరికా, ఫ్రాన్స్‌ దేశాల్లో పెద్దగా ఎవరూ ఆలోచించడం లేదని.. పేస్ట్రీలు, వైన్‌ లేకపోతే బతికేదెలా? అని ఎదురు ప్రశ్నిస్తున్నారు. 

వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో.. చాలే దేశాలు ప్రజలకు ఏవి అత్యవసరమో గుర్తించి.. ఆ దుకాణాలనే తెరిచి ఉంచడానికి అనుమతి ఇచ్చాయి ఆయా దేశాలు. బయట అత్యవసర విధుల్లో ఉండటానికి హెల్త్‌ వర్కర్లు, పోలీసులు, పారిశుద్య కార్మికులు, ఆహార పదార్థాల రవాణాకు మాత్రమే పర్మిషన్‌ ఉంది. ఇన్ని ఆంక్షలు ఉన్నా.. అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో  గోల్ఫ్‌, గన్స్‌, గంజాయి లేకపోతే ఎలా అని కళ్లు పెద్దవి చేసి మారీ ప్రశ్నిస్తున్నారు. అమెరికాలో విచ్చల విడి గన్‌ కల్చర్‌ వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. చేతిలో తుపాకీ ఉంటే ఉన్మాదిగా మారి ఎదుటివారి ప్రాణాలు తీసిన ఘటనలు గతంలో అనేకం జరిగాయి. అయినప్పటికీ కరోనా లాక్‌డౌన్ సమయంలోనూ ప్రజలు తుపాకులే అత్యవసరం అని కోరుకోవడం విచిత్రం. 

ఇక బ్రిటన్‌లో సూపర్‌మార్కెట్లలో బీర్‌, వైన్‌ క్షణాల్లో అయిపోవడంతో..అంతకుముందు మూసేసిన లిక్కర్‌ స్టోర్స్‌ను కూడా తెరవాల్సి వచ్చింది. ఇంటి దగ్గర కూర్చున్న జనం అదే పనిగా పెగ్గుమీద పెగ్గు వేస్తున్నారో.. లేక ముందు జాగ్రత్తో తెలియదు కానీ.. బ్రిటన్‌లో మద్యం లేకపోతే చచ్చిపోతామనే ఫీలింగ్‌ కనిపిస్తోందని కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. చాలా దేశాల్లో ఇంటర్నెట్‌కు డిమాండ్‌ విపరీతంగా పెరిగింది. లాక్‌డౌన్‌  సమయంలో ఇళ్లల్లోనే ఉంటున్న జనాలు ఇంటర్నెట్‌తోనే ఎక్కువగా కాలక్షేపం చేస్తున్నారు. నెట్‌ ఓపెన్‌ చేసి సినిమాలు, సీరియళ్లు చూసేవారు కొందరైతే.. ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడేవారు మరికొందరు ఉన్నారు. మొన్నటి వరకూ పిల్లలు నెట్‌ దగ్గర ఎక్కువ సేపు కూర్చుంటే వద్దన్న వారు సైతం.. పోనీలే అని వదిలేస్తున్నారు. ఇలా ఆయా దేశాల్లో లాక్‌డౌన్‌ సమయంలో ప్రజలు ఒక్కొక్కరూ ఒక్కో విధంగా స్పందిస్తున్నారు.