ఆంధ్రప్రదేశ్‌ - CLICK HERE

ఆళ్లగడ్డ
ఆళ్లగడ్డ

2014 సాధారణ ఎన్నికలలో సీనియర్ మహిళా నేత, ఆళ్లగడ్డ సిట్టింగ్ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి , ఎన్నికల నామినేషన్లు పూర్తి అయ్యాక రోడ్డుప్రమాదంలో మరణించారు. అయితే కొత్త నిబంధనల ప్రకారం ఎన్నిక వాయిదా పడలేదు. బ్యాలెట్ పేపర్ లో ఆమె పేరు యధాతధంగా కొనసాగింది. మెజార్టీ ఓటర్లు దివంగత నేత శోభా నాగిరెడ్డిని ఓటు వేసి నివాళి అర్పించారు. దేశంలో చనిపోయిన తర్వాత కూడా ఎన్నికైన ఏకైక నేతగా ఆమె రికార్డుకెక్కారు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికలో ఆమె కుమార్తె అఖిలప్రియ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 
అఖిలప్రియ, ఆమె తండ్రి నాగిరెడ్డిలు ఒకేసారి శాసనసభలో ఉంటడం విశేషం. 2014లో శోభా నాగిరెడ్డి  17928 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ ఎన్నికతో కలిసి మొత్తం ఐదుసార్లు ఎన్నికయ్యారు ఆమె. తర్వాత జరిగిన పరిణామాలతో అఖిలప్రియ టిడిపిలో చేరి , చంద్రబాబు క్యాబినెట్ లో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 1967 నుంచి ఆళ్లగడ్డలో మూడు కుటుంబాల వారి మధ్య పోటీ జరగుతుండటం విశేషం.  గంగుల, ఎస్వీ, భూమా కుటుంబాలే అత్యధిక కాలం ఇక్కడ ప్రాతినిధ్యం వహించాయి. గంగుల తిమ్మారెడ్డి 1967లో ఎస్వీ సుబ్బారెడ్డిని ఓడిస్తే, తిరిగి తిమ్మారెడ్డిని సుబ్బారెడ్డి 1972లో ఓడించారు. 1978లో మళ్లీ తిమ్మారెడ్డి గెలిచారు. ఆయన ఆకస్మిక మరణం తర్వాత తిమ్మారెడ్డి కుమారుడు గంగుల ప్రతాపరెడ్డి గెలిచారు. 1989లో భూమా శేఖర్ రెడ్డి గెలవగా, ఆయన హఠాత్ మరణంతో ఆయన సోదరుడు భూమా నాగిరెడ్డి గెలిచారు. భూమా సీనియర్ నేత ఎస్వీ సుబ్బారెడ్డి అల్లుడు. రెండుసార్లు ఆయన గెలిచారు. 2014లో నంద్యాల నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. ఎస్వీ సుబ్బారెడ్డి పత్తికొండ నుంచి మరో మూడుసార్లు మొత్తం ఐదుసార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. ఎస్వీ సుబ్బారెడ్డి గతంలో చంద్రాబాబు క్యాబినెట్ లో మంత్రిగా ఉన్నారు. 2009లో ఎస్వీ సుబ్బారెడ్డి కూడా టిడిపిని వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. 1997 నుంచి 2003 వరకు రెండు టర్మ్ లలో శోభ, ఆమె తండ్రి సుబ్బారెడ్డి ఇద్దరూ కూడా అసెంబ్లీలో ఉండటం అరుదైన ఘటన. సుబ్బారెడ్డి కుమారుడు మోహన్ రెడ్డి ఒకసారి ఎమ్మెల్సీగాను, 2014లో కర్నూలు నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 
ఆళ్లగడ్డలో 17సార్లు ఎన్నికలు జరగ్గా ఆరుసార్లు టిడిపి, నాలుగుసార్లు కాంగ్రెస్ పార్టీ,మూడుసార్లు వైసిపి , ఒకసారి ప్రజారాజ్యం గెలిచాయి. ముగ్గురు ఇండిపెండెంట్లు కూడా గెలుపొందారు. తిమ్మారెడ్డి రెండుసార్లు, సుబ్బారెడ్డి ఒకసారి ఇండిపెండెంటుగా గెలవడం విశేషం. 

Activities are not Found
No results found.
By Continuing to use our site you consent to the use of cookies as described in our privacy policy Accept and Close
Telegram Connect With Telegram