ఆంధ్రప్రదేశ్‌ - CLICK HERE

  • నియోజకవర్గాలు
నంద్యాల
నంద్యాల

2014 సాధారణ ఎన్నికలలో నంద్యాల పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి వైసిపి అభ్యర్ధి ఎస్.పి.వై.రెడ్డి మరోసారి గెలిచారు.ఆయన తన సమీప టిడిపి ప్రత్యర్ధి ఎన్.ఎం.డి.ఫరూఖ్ పై 105766 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2009లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలిచిన ఎస్పీవై రెడ్డి, 2014లో వైసిపి తరపున మూడోసారి విజయం సాధించారు.  అయితే ఎంపిగా గెల్చిన కొద్ది రోజులకే ప్రమాణస్వీకారం చేయకుండానే టిడిపి అధినేత చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరిపోయారు. లోక్ సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకచోట తప్ప మిగిలిన ఆరుచోట్ల వైసిపి అధిక్యత సాధించింది. వైసిపికి ఆళ్లగడ్డలో 19023, శ్రీశైలంలో 8109, నందికొట్కూరులో 25608, పాణ్యంలో 30917, నంద్యాలలో 16480, డోన్ లో 13150 ఓట్ల మెజార్టీ వచ్చింది. టిడిపికి బనగానపల్లెలో 8006 ఓట్ల అధిక్యత లభించింది. 
నంద్యాల లోక్ సభ స్థానానికి మూడు ఉప ఎన్నికలతో సహా మొత్తం 17సార్లు ఎన్నికలు జరిగితే.. కాంగ్రెస్, కాంగ్రెస్ ఐ లు కలిసి 10సార్లు, టిడిపి నాలుగుసార్లు, వైసిపి ఒకసారి, బిఎల్డీ(జనతా) ఒకసారి, ఇండిపెండెంటు ఒకరు గెలుపొందారు. నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. దేశానికి రాష్ట్రపతి, ప్రధానిని అందించిన ఘనత ఈ నియోజకవర్గానిదే. నీలం సంజీవరెడ్డి రాష్ట్రపతిగా ఎన్నికవడానికి ముందు 1977లో ఇక్కడే గెలుపొందారు. ముందుగా లోక్ సభ స్పీకర్ , ఆ తర్వాత ఏకగ్రీవంగా రాష్ట్రపతి అయ్యారు. ఆ తర్వాత ఇక్కడ జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్ధి పెండేకంటి వెంకట సుబ్బయ్య గెలిచారు. ఇక ఆనాటి ప్రధాని పివి.నరసింహారావు అనూహ్యంగా ఆ పదవిలోకి వచ్చాక నంద్యాల నుంచి పోటీ చేయదలిచారు. అప్పట్లో ఎంపిగా ఉన్న గంగుల ప్రతాపరెడ్డి పివి కోసం రాజీనామా చేశారు. పివి రెండుసార్లు ఇక్కడ నుంచే ఎన్నికయ్యారు. ఆయన హనుమకొండ నుంచి రెండుసార్లు, మహారాష్ట్రలోని రాంటెక్ , ఒడిషాలోని బరంపురంల నుంచి కూడా ఎన్నికై రికార్డు సృష్టించిన ఏకైక తెలుగు నేత పివి. రెండోసారి ఎన్నికయ్యాక ఆయన ఈ స్థానాన్ని వదిలిపెట్టగా టిడిపి అభ్యర్ధి భూమా నాగిరెడ్డి గెలిచారు. కాంగ్రెస్ సీనియర్ నేత పెండేకంటి వెంకటసుబ్బయ్య నంద్యాల నుంచి నాలుగుసార్లు, ఆదోని నుంచి రెండుసార్లు గెలుపొందారు. నీలం సంజీవరెడ్డి ఇక్కడ నుంచి ఒకసారి, హిందూపూర్ నుంచి మరోసారి గెలిచారు. భూమా నాగిరెడ్డి మూడుసార్లు, ఎస్.పి.వై.రెడ్డి మూడుసార్లు గెలుపొందారు. శేషగిరిరావు, మద్దూరు సుబ్బారెడ్డి, బొజ్జా వెంకటరెడ్డి, గంగుల ప్రతాపరెడ్డి ఒక్కోసారి గెలిచారు. నీలం, పివి ఇద్దరు రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా పని చేయడమే కాకుండా, దేశానికే వీరిద్దరూ నాయకత్వం వహించిన అరుదైన తెలుగు నేతలు.. పివి.సుబ్బయ్య కూడా కేంద్రమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 

Activities are not Found
No results found.