ఆంధ్రప్రదేశ్‌ - CLICK HERE

  • నియోజకవర్గాలు
ఒంగోలు
ఒంగోలు

2014 సాధారణ ఎన్నికలలో ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి వైసిపి అభ్యర్ధి వైవి.సుబ్బారెడ్డి విజయం సాధించారు. ఆయన తన సమీప టిడిపి ప్రత్యర్ధి మాగుంట శ్రీనివాసులురెడ్డిపై 15559 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. సుబ్బారెడ్డికి 589861 ఓట్లు వస్తే, శ్రీనివాసులురెడ్డికి 574302 ఓట్లు లభించాయి. ఇక కాంగ్రెస్ తరపున పోటీ చేసిన దర్శి పవనకుమార్ కు 13356 ఓట్లు రావడంతో డిపాజిట్ కోల్పోయారు. సుబ్బారెడ్డి దివంగత సిఎం వైఎస్ తోడల్లుడు. మాగుంట శ్రీనివాసులురెడ్డి ఒంగోలు మూడుసార్లు కాంగ్రెస్ తరపున లోక్ సభ కు ఎన్నికయ్యారు. తెలంగాణ ఏర్పాటు నేపధ్యంలో కాంగ్రెస్ ను వీడి టిడిపిలో చేరి 2014 ఎన్నికలలో పోటీ చేశారు. ఒంగోలు లోక్ సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో టిడిపికి నాలుగుచోట్ల, వైసిపికి మూడుచోట్ల అధిక్యత లభించింది. వైసిపికి ఎర్రగొండపాలెంలో 19373, మార్కాపురంలో 8309, గిద్దలూరులో 12302 ఓట్ల అధిక్యత వచ్చింది. టిడిపికి దర్శిలో 1025, ఒంగోలులో 13528, కొండపిలో 5168, కనిగిరిలో 5148 ఓట్ల మెజార్టీ లభించింది. 
1952లో ద్విసభ్య నియోజకవర్గంగా ఉన్నప్పుడు ఇద్దరు ఇండిపెండెంట్లు గెలిచారు. మిగిలిన ఎన్నికలలో కాంగ్రెస్, కాంగ్రెస్ ఐ లు కలిసి 11సార్లు, టిడిపి రెండుసార్లు, సిపిఐ ఒకసారి, వైసిపి ఒకసారి గెలిచాయి. ఇక్కడ మాగుంట శ్రీనివాసులురెడ్డి మూడుసార్లు, ఆయన సోదరుడు సుబ్బిరామిరెడ్డి ఒకసారి , సుబ్బిరామిరెడ్డి భార్య పార్వతమ్మ మరోసారి గెలిచారు. సుబ్బరామిరెడ్డిని నక్సలైట్లు హత్య చేశారు. మేకపాటి రాజమోహన్ రెడ్డి ఇక్కడ, నరసరావుపేటలో ఒక్కోసారి గెలుపొందారు. నెల్లూరులో మూడుసార్లు గెలిచి మొత్తం ఐదుసార్లు లోక్ సభకు ఎన్నికయ్యారు. అంకినీడు ప్రసాదరావు ఇక్కడ ఒకసారి, బాపట్లలో రెండుసార్లు మొత్తం మూడుసార్లు గెలుపొందారు. పలి వెంకటరెడ్డి రెండుసార్లు ఇక్కడ, ఒకసారి కావలిలో గెలిచి మొత్తం మూడుసార్లు గెలిచారు. ప్రముఖ నటుడు కొంగర జగ్గయ్య, రొండా నారపరెడ్డి, నానాదాస్, పివి.రాఘవయ్య, మాదాల నారాయణస్వామి, బెజవాడ పాపిరెడ్డి, కరణం బలరామ్, వైవి.సుబ్బారెడ్డిలు ఒక్కోసారి గెలిచారు. పులి వెంకటరెడ్డి, అంకినీడు ప్రసాదరావులు కేంద్రంలో మంత్రులుగా పని చేశారు. నాలుగు చట్టసభలకు వెళ్లిన అతికొద్దిమందిలో బెజవాడ పాపిరెడ్డి ఒకరు. 

Activities are not Found
No results found.