లక్ష మంది పోలీసులతో భారీ భద్రత

లక్ష మంది పోలీసులతో భారీ భద్రత

శుక్రవారం జరిగే తెలంగాణ పోలింగ్‌లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని అడిషనల్ డీజీ జితేందర్ తెలిపారు. ఈ రోజు ఆయన మీడియా  సమావేశంలో మాట్లాడుతూ... ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మంది పోలీసులతో భారీ భద్రతను ఏర్పాటు చేశామన్నారు. పోలీస్ శాఖలో హోంగార్డు  నుంచి ఉన్నతాధికారి వరకు సుమారు 50 వేల మంది ఎన్నికల బందోబస్తులో పాల్గొంటున్నారు. అటు పొరుగు రాష్ట్రాల నుంచి 20 వేల మంది, కేంద్ర బలగాల నుంచి 20 వేల మంది తెలంగాణ ఎన్నికల్లో విధులు నిర్వహించనున్నారు. ఈవీఎంలను పోలింగ్ కేంద్రాలకు తరలించడం నుంచి.. తిరిగి స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించేవరకు లక్ష మంది పోలీసులు విధుల్లో ఉంటారని ఆయన తెలిపారు.

ప్రధాన ఎన్నికల అధికారుల ఆదేశాలకు అనుగుణంగా భద్రత నిర్వహించామని అడిషనల్ డీజీ జితేందర్ తెలిపారు. 414 ఫ్లయింగ్ స్కాడ్.. 404 ఎస్ఎస్ టీంలు.. 3,385 సంచార బృందాలు.. 279 కేంద్ర బలగాలతో భద్రతను ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటి వరకు పోలీస్ శాఖ 125 కోట్లు డబ్బు.. 4 లక్షల లీటర్ల లిక్కర్ ను సీజ్ చేసింది. ప్రతి పోలింగ్ కేంద్రాల వద్ద మొబైల్ టీమ్స్ ఏర్పాటు చేసామన్నారు. తెలంగాణలో మావోయిస్టుల ప్రభావం లేదు. అయినా కూడా అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద అప్రమత్తంగా ఉన్నాం. మహారాష్ట్ర, చత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో పటిష్ట భద్రత ఏర్పాటు చేశాం. 4 వేలకుపైగా సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించాం. ప్రతి ఏరియాలో చెక్ పోస్టులను ఏర్పాటు చేశాం. కూంబింగ్ ఆపరేషన్ కోసం స్పెషల్ టీంలను ఏర్పాటు చేశామన్నారు. ప్రజలందరూ  ప్రశాంతంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని డీజీ జితేందర్ సూచించారు.