పదేళ్ల చిన్నారిపై స్కూల్ స్వీపర్ అత్యాచారం

పదేళ్ల చిన్నారిపై స్కూల్ స్వీపర్ అత్యాచారం

దేశ రాజధానిలో మరో దారుణం వెలుగుచూసింది. ఈస్ట్ ఢిల్లీలోని షాదరా ప్రాంతంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో స్వీపర్ గా పనిచేస్తున్న 38 ఏళ్ల షిరోజ్ పదేళ్ల బాలికపై అత్యాచారం జరిపాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపుతానని బెదిరించడంతో ఆ బాలిక ఎవరి ఈ విషయం చెప్పలేదు. రెండు రోజుల తరువాత అనారోగ్యానికి గురైంది. ఇంట్లోని బంధువులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షల్లో బాలికపై అత్యాచారం జరిగినట్లు తెలింది. బాలికను నిలదీయడంతో అసలు విషయం తెలిపింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు స్కూల్ స్వీపర్ ను అదుపులోకి తీసుకున్నారు. 

ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పదేళ్ల బాలిక ఢిల్లీలోని షాదరా ఏరియాలో బంధువుల వద్ద ఉంటూ అక్కడే ఉన్న ఓ ప్రభుత్వ పాఠశాలలో ఐదో తరగతి చదువుకుంటుంది. స్కూల్ లో మధ్యాహ్నం చెట్టుకింద భోజనం చేస్తున్న సమయంలో స్వీపర్ తాను చూపించిన ప్రదేశంలో తినాలని తెలిపాడు. ఆ ప్రాంతంలో భోజనం చేస్తున్న బాలికను వెనుక నుంచి నోరు మూసి ఓ ఖాళీ గదిలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు డీసీపీ మేఘనా యాదవ్ తెలిపారు. అతనిపై సెక్షన్ 376, పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశామని అన్నారు. ఇంతకు ముందు స్కూల్ లో స్వీపర్ ఇలాంటి దాడి చేశారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.