బాబ్లీ నాలుగు గేట్లు ఎత్తివేత...

బాబ్లీ నాలుగు గేట్లు ఎత్తివేత...

తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర గోదావరి నది నూతన జలకళ సంతరించుకుంది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో మహారాష్ట్రలో భారీ వర్షాలు కురిశాయి. దీంతో బాబ్లీ ప్రాజెక్ట్ కు భారీగా వరద నీరు వచ్చిచేరింది. భారీ వరద నీరు రావడంతో 4 గేట్లు ఎత్తి దిగువకు 98,873 క్యూసెక్కుల నీటిని గోదావరి నదికి విడుదల చేశారు. గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు బాబ్లీ, విష్ణుపురి భారీ స్థాయిలో వరద నీరు చేరింది. ఆదివారం ఒక్కరోజే నాందేడ్ జిల్లా పరిధిలో 160 మిల్లీమీటర్ల వర్షం పడింది. ఈ వర్షాల కారణంగా సోమవారం బాబ్లీ ప్రాజెక్ట్ లోని ఒక గేటును ఎత్తి నీటిని గోదావరిలోకి వదిలిన అధికారులు.. సాయంత్ర సమయానికి వరద  మరీ ఎక్కువ కావడంతో మొత్తం నాలుగు గేట్లు ఎత్తి 98,873 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు వదిలారు. ఈ వదిలిన నీటితో త్రివేణి సంగమం జలకళలాడుతుంది. మరోవైపు శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరదనీరు మొదలైంది. ప్రాజేక్ట్ గేట్లను మహారాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేయడంతో నాటు పడవలు నడిపే వారిని, భక్తులను అప్రమత్తంగా  ఉండాలని బాసర మండల తహసిల్దార్ వేంకటరమణ, ఆలయ ప్రత్యేకాధికారి సుధాకర్ రెడ్డి సూచించారు.