అద్దె ఆటోలో రూ.40 కోట్లు!

అద్దె ఆటోలో రూ.40 కోట్లు!

సాధారణ వ్యాపారి తాను నిర్వహించే చిన్నపాటి వ్యాపారం విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటాడు. వ్యాపారం సరిగా సాగేందుకు, తన డబ్బులు దొంగల బారిన పడకుండా వుండేందుకు తగిన భద్రతను ఏర్పాటు చేసుకుంటాడు. కానీ.. వేల కోట్ల రూపాయల లావాదేవీలు నిర్వహించే బ్యాంకులు మాత్రం భద్రతను గాలికి వదిలేస్తుండడం విమర్శలకు తావిస్తోంది. ఒక బ్యాంకు నుంచి మరో బ్యాంకుకు నగలు, నగదును తరలించే సమయంలో భద్రతా ప్రమాణాలు పాటించాల్సిన విషయం జగద్విదితమే. కానీ తెలంగాణలోని బ్యాంకుల అధికారులు ఇవేమీ తమకు పట్టవని మరోసారి నిరూపించారు. రైతుబంధు పథకానికి సంబంధించి.. ఆర్‌బీఐ నుంచి ఆఘమేఘాల మీద కరెన్సీని రప్పించారు. ఇలా రప్పించిన నగదును.. ఒక బ్యాంకు నుంచి మరో బ్యాంకుకు తరలించేందుకు ఎటువంటి భద్రత లేకుండా ఓ మినీ ట్రక్కులో ఎక్కిస్తుండగా చూసినవారంతా ముక్కున వేలేసుకున్నారు.

నల్గొండ క్లాక్ టవర్ వద్ద ఈ ట్రక్కును చూసిన స్థానికులు.. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు బ్యాంకు వద్దకు వెళ్లారు. అనంతరం పకడ్బందీ సెక్యూరిటీతో ఆ నగదును తరలించారు. ఏమాత్రం సెక్యూరిటీ ప్రోటోకాల్ పాటించకుండా ఇలా చేరవేస్తుండడం చర్చనీయాంశమైంది. జిల్లా కేంద్రంలోని ఎస్‌బీఐ ప్రధాన శాఖ నుంచి ఈ అద్దె ఆటోలో రూ.40 కోట్లను గ్రామీణ వికాస్‌ బ్యాంకుకు తరలించాలని అధికారులు భావించారు. కానీ కనీస రక్షణ చర్యలు తీసుకోలేదు. నోట్లు బయటకు కనిపించకుండా ఏర్పాట్లు కూడా చేపట్టలేదు.