ఎడారిలో 500 కి.మీ.ల హైవే... 

ఎడారిలో 500 కి.మీ.ల హైవే... 

చైనానా మజాకా... నీటిపై బ్రిడ్జీ కట్టడం, కొండల్లో, కోనల్లో రోడ్లు వేయటం మనం చూశాం. చైనా ఏకంగా కాలు పెడితే ఇసుకలోకి కూరుకుపోయే ఎడారిలో భారీ రోడ్డు వేసింది. ఆ ఎడారి పేరు చెబితేనే చైనా ప్రజలు భయంతో వణికిపోతారు. కారణం ఆ ఏడారిలోకి వెళితే తిరిగి వచ్చిన దాఖలాలు లేవు. అలాంటి ఎడారిలో భారీ హైవే నిర్మించింది. తక్లమకాన్ ఎడారి చైనా దేశంలోని షిన్జాంగ్ 'ఉయ్ఘర్  అటానమస్' ప్రాంతపు నైరుతి భాగంలో ఉంది. ఇది తారిమ్ నదీ పరీవాహక ప్రాంతంలో విస్తరించి ఉంది. 

ఈ ఎడారి విస్తీర్ణంలో 85 శాతం కదిలే ఇసుక దిబ్బలు ఆక్రమించి ఉన్నాయి. క్రమం తప్పకుండా తరలే ఇసుక దిబ్బలు ఈ ఎడారి ప్రత్యేకత. ఉయ్ఘర్ భాషలో తక్లామకన్ అనగా వెళ్ళడమే గాని తిరిగి రాలేని ప్రాంతం అని అర్థం. అందుకే ఈ ఎడారిని మృత్యు ఎడారిగా  పిలుస్తారు. ఎడారిలోకి ఒకసారి వెళితే తిరిగి వచ్చే అవకాశం తక్కువ. అలాంటి ఎడారిలో చైనా భారీ హైవే నిర్మించింది. ఇంకేముంది ఇప్పుడు రయ్ రయ్ మంటూ వాహనాలు దూసుకు పోతున్నాయి. ఉత్తర తక్లిమాకాన్ లోని లునాన్ నుంచి చైనా దక్షిణ ప్రాంతంలోని మిన్ఫెంగ్ వరకు హైవే నిర్మించింది. సుమారు 522 కి.మీ.లు ఉన్న మొదటి హైవే 1995 వ సంవత్సరంలో నిర్మిచింది. రెండవ రోడ్ దశాబ్ధం క్రితం ప్రారంభించింది. రెండు ప్రముఖ నగరాలైన హోటన్, ఆరల్ మధ్య దూరం తగ్గించేందుకు ఈ రహదారిని నిర్మించారు. ఈ రహదారి నిర్మాణంతో రెండు నగరాల మధ్య ప్రయాణ దూరం 550 కి.మీ. తగ్గుతుంది. దాదాపు ఏడు గంటలు సమయం ఆదా అవుతుంది. మూడు వైపులా పర్వతాలు, మరోవైపు గోబీ ఎడారి వున్న తక్లమకాన్ ఎడారి ఒకప్పుడు దుర్భేధ్యమైన ప్రాంతం. ఈ ఎడారిలో అపారమైన చమురు, సహజవాయు నిక్షేపాలు బయల్పడ్డాయి. చైనాకు ఈ ఎడారి కీలక వ్యూహాత్మక ప్రాంతం.