అత్తమామల వేధింపులకు అల్లుడు ఆత్మహత్య

అత్తమామల వేధింపులకు అల్లుడు ఆత్మహత్య

అత్తమామల సూటిపోటి మాటలకు కలతచెందిన అల్లుడు.. ప్రాణాలు తీసుకున్నాడు. ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. నిజామాబాద్ నవీపేట లక్ష్మీ కిసాన్‌ఫారం ప్రాంతానికి చెందిన చంద్రశేఖర్(27), వనస్థలిపురానికి చెందిన సౌజన్య భార్యభర్తలు. వీరికి రెండేళ్ల క్రితం పెళ్లయింది. ఇద్దరూ బేగంపేటలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్నారు. ఇద్దరి మధ్య గొడవలు రావడంతో 2 నెలల క్రితం భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి తమ కూతురికి విడాకులు ఇవ్వాలంటూ అత్తమామలు చంద్రశేఖర్‌ను డిమాండ్‌ చేయటం మొదలుపెటారు. 

ఈ వేధింపులు రోజురోజుకూ ఎక్కువవడంతో ఈ నెల 5న తల్లిదండ్రులకు ఫోన్‌చేసి ఆన్‌లైన్‌లో రైల్‌టికెట్లను బుక్‌చేశానని, 7న ఉదయం వరకు రావాలని చంద్రశేఖర్‌ కోరాడు. తల్లిదండ్రులు ఇంటికి వచ్చి చూడగా సీలింగ్‌ఫ్యాన్‌కు చంద్రశేఖర్ ఉరివేసుకుని కనిపించాడు. చంద్రశేఖర్‌ ఆత్మహత్యకు అత్తమామల వేధింపులే కారణమని.. అతని తండ్రి మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేశారు. అత్తమామలు వేధిస్తుననారని.. వారిని కఠినంగా శిక్షించాలని రాసి ఉన్న సూసైడ్ నోట్‌ను చంద్రశేఖర్ జేబులో పోలీసులు గుర్తించారు.