జగన్‌కు అచ్చెన్నాయుడు సవాల్‌..

జగన్‌కు అచ్చెన్నాయుడు సవాల్‌..

పోలవరం నిర్మాణంలో అవినీతి జరుగుతోందంటూ వైసీపీ అధినేత జగన్‌ విమర్శించడంపై మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. తానే దగ్గరుండి పోలవరం మొత్తం తిప్పి చూపిస్తానని చెప్పారు. ఇవాళ శ్రీకాకుళంలో ఆయన మాట్లాడుతూ  'జగన్.. రేపు..ఎల్లుండి ఎక్కడుంటావో చెప్పు. నేనే వచ్చి నిన్ను నా కారులో తీసుకెళతా.. అంతా తిప్పుతా...పోలవరం నిర్మాణం ఎలా జరుగుతుందో చూపిస్తా' అని చెప్పారు. అప్పటికి కూడా అవినీతి జరిగిందని నిరూపిస్తే  తాను రాజకీయాల్లోంచి తప్పుకుంటానని స్పష్టం చేశారు. ప్రభుత్వం పై జగన్ చేస్తున్న విమర్శలకు ఇదే తన సవాల్ అని మంత్రి చెప్పారు. 

ఇక.. పాదయాత్రకు ఉన్న పవిత్రతను జగన్ అపహాస్యం చేశారని అచ్చెన్నాయుడు అన్నారు. రోజుకి 8 కిలోమీటర్లు వాకింగ్ చేయడం కూడా పాదయాత్రేనా అని ప్రశ్నించారు. పాదయాత్ర ద్వారా జగన్ సాధించిందేంటి .. ప్రజలకు ఇచ్చిన  భరోసా ఏంటి అని ప్రశ్నించారు. పాదయాత్ర వల్ల జగన్ కు నష్టమే తప్ప లాభం జరగలేదన్న అచ్చెన్న.. ఇచ్ఛాపురం మరో రెండు మూడు ఎన్నికల నాటికి స్థూపాలతో నిండిపోతుందని ఎద్దేవా చేశారు. 

ఏం సాధించారని జగన్‌ స్థూపాలు పెట్టుకుంటున్నారని..ఆ స్థూపాలకు చేసిన ఖర్చు పేదవాడికి ఇస్తే ప్రయోజనం కలిగేదని అన్నారు. తిత్లీ ధాటికి అతలాకుతలమై శ్రీకాకుళం జిల్లా కష్టాల్లో ఉన్నప్పుడు స్పందించని జగన్‌ను తమ జిల్లాలో ఎందుకు పాదయాత్ర చేయనివ్వాలని ప్రశ్నించారు. కానీ.. తమకు సంస్కారం ఉంది కాబట్టే జగన్ ను అడ్డుకోలేదని చెప్పారు.