హైకోర్టు భవన నిర్మాణ పనులకు టెండర్ ఖరారు

హైకోర్టు భవన నిర్మాణ పనులకు టెండర్  ఖరారు

ఎట్టకేలకు ఏపీ రాజధాని అమరావతిలో హైకోర్టు నిర్మాణ పనులకు టెండర్ ఖరారు అయ్యింది. నిర్మాణ పనులకు షాపూర్జీ-పల్లోంజీ, ఎల్‌ అండ్‌ టీ, ఎన్‌సీసీ సంస్థలు పోటీ పడ్డగా అందరికంటే తక్కువ మొత్తానికి బిడ్‌ దాఖలు చేసిన షాపూర్జీ సంస్థ పనులు దక్కించుకుంది. హైకోర్టు నిర్మాణానికి రూ.996 కోట్ల అంచనా వ్యయంతో సీఆర్‌డీఏ టెండర్లు పిలవగా.. షాపూర్జీ సంస్థ 4.3 శాతం ఎక్కువ మొత్తానికి బిడ్‌ దాఖలు చేసింది. 

 

నిర్మాణ ఒప్పందంలో భాగంగా  హైకోర్టు భవనం స్ట్రక్చర్‌ను మాత్రం షాపూర్జీ సంస్థ నిర్మిస్తుంది. మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ప్లంబింగ్‌ వంటి పనులకు తిరిగి విడిగా టెండర్లు పిలువనున్నారు. భవనాన్ని బౌద్ధ స్థూపాన్ని పోలిన ఆకృతిలో నిర్మించనున్నారు. లండన్‌కు చెందిన నార్మన్‌ ఫోస్టర్‌ అండ్‌ పార్ట్‌నర్స్‌ సంస్థ ఈ ఆకృతిని రూపొందించింది. జీ+7 విధానంలో నిర్మిస్తారు. సెల్లార్‌, గ్రౌండ్‌ ఫ్లోర్‌లను వాహనాల పార్కింగ్ కు కేటాయించనున్నారు. రాజధానిలో తొలి దశలో మౌలిక వసతుల అభివృద్ధికి, శాసనసభ, హైకోర్టు, సచివాలయం వంటి ప్రభుత్వ భవనాల నిర్మాణానికి సుమారు రూ.38 వేల కోట్ల వరకు వ్యయమవుతుందని అంచనా వేశారు. వీటిలో సుమారు రూ.28 వేల కోట్ల పనులకు ఇప్పటికే టెండర్లు ఖరారు చేశారు. మరో రూ.10 వేల కోట్ల పనులకు త్వరలో టెండర్లు పిలవనున్నారు.

 

హైకోర్టు భవన నిర్మాణ పనుల టెండర్‌ను షాపూర్జీ పల్లొంజీ కంపెనీ దక్కించుకొన్నట్లు సీఆర్డీయే కమిషనర్‌ డాక్టర్‌ చెరుకూరి శ్రీధర్‌ మీడియాకు తెలిపారు. 24 నెలలలో నిర్మాణం పూర్తవుతుందని చెప్పారు. అసెంబ్లీ భవనం నిర్మాణ డిజైన్లను కొంత మార్చామని, అవి వచ్చిన తర్వాత 2 నెలల్లో టెండర్లు పిలుస్తామన్నారు. ‘అసెంబ్లీ భవన నిర్మాణం కొంత క్లిష్టంగా ఉంటుంది. దానికి పైన 250 మీటర్ల ఎత్తుతో ఒక టవర్‌ నిర్మిస్తున్నాం. ఇది 65 అంతస్తుల ఎత్తుతో సమానం. వంద మీటర్ల ఎత్తులో 150 మంది నిలబడి చూడటానికి ఒక డెక్‌ నిర్మిస్తున్నాం. అక్కడి నుంచి పైకి 250 మీటర్ల ఎత్తు వరకూ ఒక క్యాప్సూల్‌లో ప్రయాణించడానికి ఏర్పాటు చేస్తున్నాం.పారి్‌సలోని ఈఫిల్‌ టవర్‌ 267 మీటర్ల ఎత్తు ఉంది. దానితో పోలిస్తే ఇది కొద్దిగా తక్కువ ఉంటుంది’ అని సీఆర్డీయే కమిషనర్‌ వివరించారు.